మంథని పట్టణ మాస్టర్ ప్లాన్ -2041 రూపకల్పనకు శాఖల వారీగా ప్రాథమిక సమాచారం అందించాలి: అదనపు కలెక్టర్ కుమార్ దీపక్
Peddaplly: 2041 అవసరాలకనుగుణంగా మంథని పట్టణ మాస్టర్ ప్లాన్ రూపకల్పన చేయాలని, దీని కోసం శాఖల వారీగా ప్రాథమిక సమాచారం అందజేయాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ కుమార్ దీపక్ సంభందిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం సమీకృత జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో మంథని మునిసిపాలిటీ -2041 మాస్టర్ ప్లాన్ రూపకల్పనపై సంబంధిత అధికారులతో సన్నాహక సమావేశం ఏర్పాటు చేసి సమీక్షించారు.
ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ, మాస్టర్ ప్లాన్ రూపొందించుటకు శాఖల వారీగా ప్రాథమిక సమాచారాన్ని మూడు రోజుల్లోగా అందించాలని ఆదేశించారు. రెవెన్యూ, పోలీస్, అటవీ, రవాణ, విద్య, ప్లానింగ్, ఇరిగేషన్, రోడ్లు భవనాలు, డిజాస్టర్ మేనేజ్మెంట్, మార్కెటింగ్, పశు సంవర్థక శాఖ, ఆరోగ్యం, గృహ నిర్మాణ, పంచాయతీ రాజ్, విద్యుత్, అగ్నిమాపక, పరిశ్రమలు, వ్యవసాయం, టూరిజం, మెప్మ, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, ఆర్టిసి, రైల్వే, మిషన్ భగీరథ, సింగరేణి, జాతీయ రహదారులు తమ పరిధిలో ప్రణాళిక తయారు చేయాలని తెలిపారు.
పట్టణంలో అందుబాటులో ఉన్న ప్రభుత్వ భూములు, అసైన్డ్ భూములు, ప్రభుత్వ ప్రతిపాదనల అమలు కోసం అవసరమయ్యే ప్రైవేట్ భూమి, విలీన గ్రామ వివరాలు, ప్రభుత్వ భవనాల వివరాలను తహసిల్దార్ తయారు చేయాలని ఆయన సూచించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన చర్యలు, క్రైమ్ రేట్ తగ్గించేందుకు అవసరమైన ప్రణాళిక, స్టేషన్ వివరాలు, రోడ్డు సిగ్నల్ వివరాలు, ట్రాఫిక్ అంచనా తదితర అంశాలపై నివేదికను పోలీస్ శాఖ వారు అందజేయాలని, హరితహారం క్రింద పట్టణంలో పచ్చదనం పెంపొందించేందుకు అవసరమైన నర్సరీలు, అటవీ ప్రాంతాల అభివృద్ధి పై నివేదిక అందించాలని, పట్టణంలో ఉన్న నీటి వనరుల సంపూర్ణ సమాచారం భవిష్యత్ ప్రాజెక్టుల ప్రణాళికలను అందించాలని సంబంధిత అధికారులకు సూచించారు. భవిష్యత్తులో పెరిగే వాహన రవాణా అంచనా వేస్తూ రోడ్ల విస్తీర్ణం పెంపు, అవసరమయ్యే నూతన రోడ్డు ప్రతిపాదనలు, తదితర వివరాలు సేకరించాలని ఆయన తెలిపారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు తీసుకోవాల్సిన చర్యలు, విద్యుత్ అవసరాలకు అవసరమయ్యే సబ్ స్టేషన్ ల నిర్మాణం, సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాట్లకు అవకాశాల పై నివేదిక అందించాలని అన్నారు.
భవిష్యత్తులో ప్రజలకు తాగునీటి ఇబ్బంది లేకుండా తీసుకోవాల్సిన చర్యలు, పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ ఏర్పాట్లను ప్రణాళిక రూపొందించాలని తెలిపారు.
ఈ సమావేశంలో జిల్లా పట్టణ, ప్రణాళిక అధికారి మునిసిపల్ ఎం.శ్రీనివాస రావు, మంథని మునిసిపల్ కమిషనర్ వి.శారద, తహసిల్దార్ ప్రకాష్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ప్రమోద్ కుమార్, పశు సంవర్ధక శాఖ అధికారి నారాయణ, పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ మధుసూదన చారీ, ఇతర జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.