ప్రేమ వ్యవహారమే కారణమా..? సికింద్రాబాద్‌లో బీటెక్ విద్యార్థి యావన్ దారుణ హత్య
హైదరాబాద్ నగరంలో బీటెక్ విద్యార్థి హత్య కలకలం రేపింది. సికింద్రాబాద్ పరిధిలోని చిలకలగూడ సీతాఫల్మండిలో 23 ఏళ్ల యావన్ అనే యువకుడిని దుండగులు కత్తులతో దాడి చేసి హత్య చేశారు. ప్రేమ వ్యవహారమే ఈ హత్యకు కారణమై ఉండొచ్చని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు.
పోలీసుల వివరాల ప్రకారం.. యావన్ బీటెక్ నాలుగో సంవత్సరం చదువుతున్నాడు. మే 7 రాత్రి ఇందిరానగర్‌లో స్నేహితులతో కలిసి ఐపీఎల్ మ్యాచ్ చూస్తుండగా, బైక్‌లపై వచ్చిన కొందరు యువకులు బయటకు పిలిచారు. మాట్లాడాలని చెప్పి ఇంటి బయటకు తీసుకెళ్లిన తర్వాత కత్తులతో దాడి చేసినట్లు తెలుస్తోంది. యావన్‌పై ఆరు కత్తిపోట్లు పొడవడంతో తీవ్ర రక్తస్రావమైంది. వెంటనే స్నేహితులు గాంధీ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
దర్యాప్తులో యావన్ ఓ యువతితో నాలుగేళ్లుగా ప్రేమలో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ ప్రేమ వ్యవహారాన్ని యువతి కుటుంబ సభ్యులు వ్యతిరేకిస్తున్నారని సమాచారం. “మా అమ్మాయిని వదిలేయ్” అంటూ యావన్‌కు గతంలో పలుమార్లు బెదిరింపులు వచ్చినట్లు తెలిసింది. ఈ క్రమంలోనే యువతి కుటుంబ సభ్యులు పగ పెంచుకుని హత్యకు పాల్పడినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
యావన్ హత్యలో ఐదుగురు పాల్గొన్నట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. ఇప్పటికే పరమేశ్, వంశీ అనే ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకోగా, మిగిలిన వారి కోసం మూడు ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు. యువతి సోదరుల పాత్రపై కూడా పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు.
నడి రోడ్డుపై జరిగిన ఈ దారుణ హత్య స్థానికంగా తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఘటనతో కుటుంబ సభ్యులు, స్థానికులు షాక్‌కు గురయ్యారు. ప్రేమ వ్యవహారాలు హత్యలకు దారితీయడం ఆందోళన కలిగిస్తోందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
