శ్రీరామనవమి ప్రత్యేకత ఏమిటి? ఎందుకు భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానంకే అంత ప్రాధాన్యం
శ్రీరామనవమి వచ్చిందంటే దేశమంతటా రామయ్య భక్తుల సందడి మొదలవుతుంది. ముఖ్యంగా భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానం వద్ద జరిగే సీతారాముల కల్యాణం చూడటానికి భక్తులు భారీగా తరలివస్తారు. దేశం నలుమూలల నుంచి వేలాది మంది భక్తులు చేరుకుని ఈ దివ్య కళ్యాణాన్ని ఘనంగా నిర్వహిస్తారు.
భద్రాద్రి రాముడి విశిష్టతకు ప్రత్యేకమైన చరిత్ర ఉంది. ఇక్కడ జరిగే శ్రీరామనవమి కల్యాణం ముహూర్తమే ప్రపంచవ్యాప్తంగా కొలమానంగా మారింది. అనేక ప్రాంతాల్లో భక్తులు ఇదే ముహూర్తాన్ని అనుసరించి సీతారాముల కల్యాణాలు జరుపుకుంటారు. అంతేకాకుండా, రాములోరి పెళ్లికి ముహూర్తం నిర్ణయించబడిన ప్రదేశం కూడా ఇదే కావడం ఈ క్షేత్రానికి మరింత ప్రత్యేకతను తెచ్చింది.
శ్రీరామనవమి అంటే కేవలం రాముడి పుట్టినరోజే కాకుండా, ఆయన వివాహ వేడుకను కూడా జరుపుకునే రోజు. చైత్ర శుద్ధ నవమి రోజునే శ్రీరాముడు జన్మించాడు. అదే రోజున ఆయన కల్యాణం జరపాలని నిర్ణయించినవారు భక్త రామదాసు. దాదాపు 400 ఏళ్ల క్రితం భక్త రామదాసు ఈ సంప్రదాయానికి శ్రీకారం చుట్టారు.
ఆయన పండితులను సంప్రదించి శాస్త్రోక్తంగా ముహూర్తాన్ని నిర్ణయించారు. పాంచరాత్ర ఆగమ శాస్త్రంలోని “ఎస్య అవతార దివసే తస్య కల్యాణ ఆచరేత్” అనే శ్లోకం ఆధారంగా—ఏ రోజు అవతారం జరిగితే, అదే రోజున కల్యాణం జరపాలని నిర్ణయించారు. దీంతో చైత్ర శుద్ధ నవమి రోజునే రాముడి కల్యాణం నిర్వహించే సంప్రదాయం ప్రారంభమైంది.
ఆశ్చర్యకరంగా, వాల్మీకి రామాయణం లేదా పద్మ పురాణంల్లో రాముడి కల్యాణం ఈ రోజున జరిగిందని స్పష్టమైన ప్రస్తావన లేకపోయినా, భద్రాచలం నుంచి ప్రారంభమైన ఈ ఆచారం ప్రపంచవ్యాప్తంగా వ్యాపించింది.
భద్రాచలంలో సీతారాముల కల్యాణం “అభిజిత్ లగ్నం”లో నిర్వహిస్తారు. సూర్యుడు నడినెత్తి మీదకు వచ్చే సమయాన్ని అభిజిత్ లగ్నంగా భావిస్తారు. ఇది దోషరహితమైన శుభ ముహూర్తంగా పరిగణించబడుతుంది. గ్రామీణ ప్రాంతాల్లో దీనిని “గడ్డపార ముహూర్తం” అని కూడా అంటారు.
ఇలా ఆధ్యాత్మిక ప్రాధాన్యత, చారిత్రక నేపథ్యం, శాస్త్రోక్త సంప్రదాయాలతో భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానం శ్రీరామనవమి వేడుకలకు కేంద్రబిందువుగా నిలుస్తోంది.
