అమెరికాలో ప్రభుత్వ షట్‌డౌన్ 40వ రోజుకు చేరుకుంది. దేశవ్యాప్తంగా విమాన సేవలకు అంతరాయం కలగడంతో ఈ ప్రతిష్టంభనను తొలగించడానికి సెనెటర్లు ఆదివారం ప్రత్యేకంగా సమావేశమయ్యారు. నిధుల విడుదలకు సంబంధించిన బిల్లులపై సెనెట్‌లో డెమోక్రాట్లు, రిపబ్లికన్ల మధ్య అంగీకారం కుదరకపోవడంతో గత నెల 1 నుంచి అమెరికాలో షట్‌డౌన్ ప్రారంభమైంది.
ప్రభుత్వ షట్‌డౌన్ కారణంగా శనివారం ఆ దేశంలో 1,400కిపైగా విమానాలు రద్దయ్యాయి. 6,000కు పైగా విమానాలు ఆలస్యమయ్యాయి. 40 విమానాశ్రయాల్లో ఎయిర్ ట్రాఫిక్‌ను 4 శాతం మేరకు తగ్గించాలని ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్(FAA) నిర్ణయించింది. షట్‌డౌన్ ఇలాగే కొనసాగితే, వచ్చే శుక్రవారం నాటికి 10శాతం విమాన సర్వీసులపై ప్రభావం పడే అవకాశం ఉంది. షట్‌డౌన్ కారణంగా గత నెల రోజులుగా విమానాశ్రయాల్లో పనిచేసే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్లకు వేతనాలు అందడంలేదు. దీంతో చాలామంది విధులకు హాజరుకావడం లేదు.

