నేడు రిజర్వేషన్ల గెజిట్లు

whatsapp image 2025 11 24 at 8.09.30 am

జిల్లాల వారీగా సిద్ధం చేసిన అధికారులు
కార్యాలయంలో హార్డ్‌ కాపీలు ఇవ్వాలని పీఆర్‌ఆర్డీ ఆదేశాలు
గెజిట్ల తర్వాతే ఎన్నికల షెడ్యూల్‌
స్థానిక ఎన్నికల నిర్వహణపై నేడు హైకోర్టు విచారణ

ఎన్నికలపై సంసిద్ధతపై ఇప్పటికే ఏజీకి పంచాయతీరాజ్‌ నోట్‌
హైదరాబాద్‌, నవంబర్‌ 23: రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన మార్గదర్శకాలకు అనుగుణంగా అధికారులు ఆదివారమే పంచాయతీ రిజర్వేషన్లను ఖరారు చేశారు. ఆర్డీవోలు, ఎంపీడీవోల ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ సర్పంచ్‌, వార్డు స్థానాల రిజర్వేషన్లను నిర్ణయించారు. ఈ మేరకు ఆయా రిజర్వేషన్ల జాబితాలను సిద్ధం చేస్తున్నారు. ఈ ప్రక్రియ ముగిశాక రిజర్వేషన్ల గెజిట్లను జిల్లాల వారీగా అధికారులు అందజేయనున్నారు. వాస్తవంగా ఆదివారం మధ్యాహ్నమే అనేక జిల్లాల్లో మండలాల వారీగా సర్పంచ్‌, వార్డు స్థానాలవారీ రిజర్వేషన్ల వివరాలు వాట్సాప్‌ గ్రూపుల్లో చక్కర్లు కొట్టాయి. ఆదివారం రాత్రి వరకు గెజిట్లను కూడా అధికారులు ముద్రించి సిద్ధంగా పెట్టుకున్నట్టు సమాచారం. సోమవారంలోగా రిజర్వేషన్ల గెజిట్లు జిల్లాలవారీగా తమకు అందజేయాలని పంచాయతీరాజ్‌ గ్రామీణాభివృద్ధి శాఖ డైరెక్టర్‌ కార్యాలయం నుంచి ఆదేశాలు వెళ్లాయి. అందుకు అనుగుణంగా కలెక్టర్లు సిద్ధంగా ఉన్నట్టు తెలిసింది.

నేడు ఎస్‌ఈసీకి రిజర్వేషన్ల గెజిట్లు
హైదరాబాద్‌, మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లాలు మినహా ఇతర 31 జిల్లాల అధికారులు జిల్లాల వారీగా పంచాయతీ రిజర్వేషన్ల గెజిట్‌ కాపీలను సోమవారం ఉదయం 10 గంటల వరకు నేరుగా హైదరాబాద్‌లోని పీఆర్‌ఆర్డీ కార్యాలయంలో అందజేయాలని ఇప్పటికే ఆదేశించారు. దూరప్రాంత జిల్లాల నుంచి అధికారులు రావాల్సి ఉన్నందున 31 జిల్లాల గెజిట్లు అందడానికి మధ్యాహ్నం వరకు సమయం పట్టే అవకాశం ఉన్నది. రిజర్వేషన్ల గెజిట్‌ కాపీలను సోమవారం సాయంత్రం వరకు రాష్ట్ర ఎన్నికల సంఘానికి (ఎస్‌ఈసీ) పంచాయతీరాజ్‌ అధికారులు చేరవేస్తారని తెలుస్తున్నది. గెజిట్లు ఎస్‌ఈసీకి చేరగానే, ఎన్నికల షెడ్యూల్‌ విడుదలకు మార్గం సుగ మం అవుతుంది. రిజర్వేషన్లు, ఇతర అంశాలను పరిశీలించి ఎస్‌ఈసీ పంచాయతీ ఎన్నికలకు షెడ్యూల్‌ను విడుదల చేయనున్నది. ఈ షెడ్యూల్‌ విడుదల మంగళవారమా? బుధవారమా? అనే దానిపై స్పష్టత రావాల్సి ఉన్నది. మంగళవారం క్యాబినెట్‌ సమావేశం ఉన్నందున 26న షెడ్యూల్‌ విడుదలకే ఎక్కువ అవకాశాలు ఉన్నాయని తెలుస్తున్నది.

నేడు హైకోర్టులో కేసు విచారణ
స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ అంశంపై నమోదైన కేసు హైకోర్టులో సోమవారం విచారణకు రానున్నది. పంచాయతీ ఎన్నికలకు సిద్ధంగా ఉన్నామని, ఏర్పాట్లు పూర్తయ్యాయని పంచాయతీరాజ్‌ శాఖ అధికారులు ప్రభుత్వానికి పూర్తిస్థాయి నోట్‌ ఇచ్చారు. ఆ నోట్‌ను అడ్వొకేట్‌ జనరల్‌కు అందజేసింది. స్థానిక ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందని విచారణ సందర్భంగా ఏజీ హైకోర్టుకు వెల్లడిస్తారని సమాచారం. కోర్టు ఆదేశం మేరకు 50 శాతం రిజర్వేషను దాటకుండా జీవో 46ను ఇచ్చినట్టు ఏజీ వివరణ ఇచ్చే అవకాశం ఉన్నది. ఈ క్రమంలో కోర్టు నుంచి ఎలాంటి అడ్డంకులు ఉండబోవని తెలుస్తున్నది. జీవో 46ను హైకోర్టులో ఎవరూ సవాల్‌ చేయలేదని తెలిసింది.

పొరపాట్లు చేయొద్దు: డైరెక్టర్‌
జీవో 46 మార్గదర్శకాలకు అనుగుణంగా గ్రామ సర్పంచ్‌, వార్డులవారీ రిజర్వేషన్ల ప్రక్రియ పకడ్బందీగా నిర్వహించాలని ఇప్పటికే అధికారులకు ఆదేశాలిచ్చినట్టు పీఆర్‌ఆర్డీ డైరెక్టర్‌ సృజన తెలిపారు. గతంలో మాదిరిగా తప్పులు, అక్షర దోషాలు ఉండొద్దని, గెజిట్‌ ముద్రించడానికి ముందే ఒకటికి రెండుసార్లు సరిచూసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించినట్టు పేర్కొన్నారు. ఈ జీవో కోర్టులో నిలువబోదని హెచ్చరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *