పల్లెల అభివృద్ధికి 99 రోజుల యాక్షన్ ప్లాన్.. పారిశుధ్యం, పన్నులు, నీటి సరఫరాపై ప్రత్యేక దృష్టి
రాష్ట్రంలోని పల్లెల రూపురేఖలు మార్చేందుకు Telangana Panchayat Raj Department 99 రోజుల ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను ప్రకటించింది. రాబోయే వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల మెరుగుదల, పారిశుధ్య వ్యవస్థ బలోపేతం ప్రధాన లక్ష్యంగా ఈ ప్రణాళిక రూపొందించారు. ఈ నెల 6 నుంచి మే 31 వరకు ప్రతి రోజు చేయాల్సిన పనులకు గడువులు నిర్దేశిస్తూ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
పన్నుల వసూలు నుంచి తాగునీటి సరఫరా వరకు, ఉపాధి హామీ పనుల నుంచి హరితహారం వరకు గ్రామాల అభివృద్ధికి సంబంధించిన ప్రతి అంశాన్ని ఈ షెడ్యూల్‌లో పొందుపరిచారు. మార్చి 6 నుంచి 15 వరకు గ్రామాల్లో పరిశుభ్రతపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలని నిర్ణయించారు. ఈ సమయంలో వీధుల్లో బ్లీచింగ్ పౌడర్ చల్లడం, తాగునీటి ట్యాంకులను శుభ్రం చేయడం వంటి కార్యక్రమాలు చేపట్టనున్నారు.
మార్చి 16 నుంచి 31 వరకు పంచాయతీల ఆర్థిక బలోపేతంపై దృష్టి సారించనున్నారు. ఆర్థిక సంవత్సరం ముగియనున్న నేపథ్యంలో 100 శాతం పన్నుల వసూలే లక్ష్యంగా ముందుకెళ్లాలని ఆదేశించారు. కొత్త ఇళ్లకు పన్నుల విధింపు, ట్రేడ్ లైసెన్సులు జారీ, షాపింగ్ కాంప్లెక్స్‌లు, మార్కెట్ల వేలం ప్రక్రియను పూర్తి చేసి పంచాయతీ ఖజానాను బలోపేతం చేయాలని సూచించారు. మహిళా సంఘాల రుణాల రికవరీని కూడా వేగవంతం చేయాలని ఆదేశాలు జారీ చేశారు.
ఉపాధి పనుల్లో వేగం
మే 1 నుంచి 15 వరకు ఉపాధి హామీ పనులను వేగవంతం చేయాలని ప్రణాళిక రూపొందించారు. ఈ క్రమంలో Mahatma Gandhi National Rural Employment Guarantee Act కింద ఫార్మ్ పాండ్స్, చెక్ డ్యాంలలో పూడికతీత, పశువుల పాకలు, న్యూట్రీ గార్డెన్ల నిర్మాణం వంటి పనులను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
మే 16 నుంచి 31 వరకు రుతుపవనాలు రాకముందే డ్రైనేజీల్లో పూడిక తొలగించాలని నిర్ణయించారు. లోతట్టు ప్రాంతాల్లో మొరం పోసి నీరు నిల్వ కాకుండా చర్యలు తీసుకోవడంతో పాటు దోమల నివారణకు యాంటీ లార్వా మందులు చల్లనున్నారు.
అలాగే Telangana Haritha Haram కార్యక్రమం కోసం మే చివరి వారంలోనే మొక్కలు నాటేందుకు గుంతలు తవ్వి సిద్ధం చేయాలని ఆదేశించారు. నర్సరీల్లో మొక్కల పెంపకాన్ని పర్యవేక్షించడంతో పాటు రోడ్ల పక్కన పిచ్చిమొక్కల తొలగింపు, కల్వర్టుల శుభ్రపరిచే పనులు, గ్రామ పంచాయతీ భవనాల పెయింటింగ్, స్లాబ్ లీకేజీల మరమ్మతులు చేయాలని సూచించారు.
తాగునీటి ఎద్దడి నివారణకు చర్యలు
ఎండలు తీవ్రంగా ఉండే ఏప్రిల్ నెలలో తాగునీటి సమస్యలు రాకుండా ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపడుతోంది. ఏప్రిల్ 1 నుంచి 15 వరకు పైప్‌లైన్ లీకేజీలు అరికట్టడం, మోటార్ల మరమ్మతులు, చేతిపంపుల బాగుచేయడం, కొత్త నల్లా కనెక్షన్లు ఇవ్వడం వంటి పనులు చేపట్టనున్నారు.
ఏప్రిల్ 16 నుంచి 30 వరకు చెత్త నిర్వహణపై ప్రత్యేక దృష్టి పెట్టనున్నారు. తడి, పొడి చెత్త వేర్వేరుగా సేకరించే విధానంపై ప్రజల్లో అవగాహన కల్పించడంతో పాటు ఇంకుడు గుంతల నిర్మాణం, ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణ యూనిట్ల ఏర్పాటు చేపట్టనున్నారు. డంపింగ్ యార్డులు, కంపోస్ట్ షెడ్లను నిరంతరం పర్యవేక్షించాలని అధికారులకు ఆదేశించారు.
ఈ షెడ్యూల్‌ను కచ్చితంగా అమలు చేయాలని, విధుల్లో నిర్లక్ష్యం వహించే అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హెచ్చరించింది. పల్లెల్లో 99 రోజుల యాక్షన్ ప్లాన్ విజయవంతం చేసే బాధ్యతలను సర్పంచులు, కార్యదర్శులు, క్షేత్రస్థాయి అధికారులకు అప్పగించింది.
