విద్యార్థుల శక్తి ముందు అధికార అహంకారం ఓడిపోయింది: మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి
హైదరాబాద్: విద్యార్థుల శక్తిని తక్కువ అంచనా వేస్తే అధికారం ఎంత పెద్దదైనా కూలిపోవాల్సిందేనని, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అందుకు నిదర్శనమని రాష్ట్ర కార్మిక, ఉపాధి, శిక్షణ, గనులు & భూగర్భశాఖ మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి పేర్కొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలపై దేశ యువత ఇచ్చిన తొలి రాజకీయ తీర్పు ఇదేనని అన్నారు. విద్యార్థుల ఉద్యమం, కాంగ్రెస్ పార్టీ చేపట్టిన పోరాటం, ముఖ్యంగా లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ నిరంతర ఒత్తిడి కారణంగానే కేంద్ర ప్రభుత్వం వెనక్కి తగ్గాల్సి వచ్చిందని పేర్కొన్నారు.
ఇది ప్రజాస్వామ్యం సాధించిన విజయమని, అధికార అహంకారం ఓడిపోయిన రోజుగా చరిత్రలో నిలిచిపోతుందని మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు.
విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడితే పదవులు పోవడమే కాకుండా ప్రభుత్వాలు కూడా మారుతాయని హెచ్చరించారు. దేశ యువతను మోసం చేసే ప్రతి నిర్ణయానికీ ప్రజలే అంతిమ తీర్పు చెబుతారని స్పష్టం చేశారు.
ప్రజల పక్షాన, విద్యార్థుల పక్షాన, యువత భవిష్యత్తు కోసం కాంగ్రెస్ పార్టీ పోరాటం నిరంతరం కొనసాగుతుందని మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి తెలిపారు.
