గిగ్ వర్కర్లకు శుభవార్త: ప్రత్యేక చట్టం దిశగా ప్రభుత్వం అడుగు – బోర్డు ఏర్పాటుకు సిద్ధం
రాష్ట్రంలో గిగ్ వర్కర్ల సంక్షేమం కోసం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునే దిశగా ముందుకు సాగుతోంది. రాష్ట్ర శాసనసభలో మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి గారు లేవనెత్తిన ప్రశ్నకు స్పందిస్తూ, కార్మిక, ఉపాధి శాఖ మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి గారు ముఖ్య ప్రకటన చేశారు.
గిగ్ వర్కర్ల హక్కుల పరిరక్షణ, సంక్షేమం కోసం ప్రత్యేక చట్టాన్ని తీసుకురాబోతున్నట్లు మంత్రి తెలిపారు. ఈ గిగ్ వర్కర్స్ బిల్లును కేబినెట్ సమావేశంలో చర్చించి, అనంతరం శాసనసభలో ప్రవేశపెట్టనున్నట్లు వెల్లడించారు.
ఈ అంశంపై జరిగిన చర్చలో ఎమ్మెల్యేలు కూనంనేని సంబశివరావు, బిర్లా ఐలయ్య తదితరులు కూడా పాల్గొని గిగ్ వర్కర్ల సమస్యలను వివరించారు. వారి సూచనలను ప్రభుత్వం పరిశీలిస్తుందని మంత్రి తెలిపారు.
బిల్లు శాసనసభ ఆమోదం పొందిన తర్వాత గిగ్ వర్కర్ల కోసం ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేయనున్నట్లు స్పష్టం చేశారు. ఈ బోర్డు ద్వారా గిగ్ వర్కర్ల సమస్యల పరిష్కారం, వివాదాల నివారణ, భద్రతా చర్యలు, న్యాయం కల్పించడం వంటి అంశాలను పర్యవేక్షిస్తారు.
ఈ నిర్ణయం ద్వారా స్విగ్గీ, జొమాటో, ఉబర్ వంటి ప్లాట్‌ఫామ్‌లలో పనిచేస్తున్న గిగ్ వర్కర్లకు భద్రతా పరిరక్షణ లభించనుంది. రాష్ట్రంలో లక్షలాది మంది గిగ్ వర్కర్ల జీవనోపాధిపై ఈ చట్టం కీలక ప్రభావం చూపనుందని భావిస్తున్నారు.
