వైద్య రాక్షసి కోరల్లో సామాన్యుడు.. సూర్యాపేటలో ప్రైవేట్ హాస్పిటల్ నిర్వాకం
సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఓ ప్రైవేట్ ఆసుపత్రి నిర్లక్ష్యం మరోసారి బయటపడింది. వైద్యం పేరిట డబ్బుల దండగకు పాల్పడుతూ సామాన్యుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఘటన స్థానికంగా తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.
ఆత్మకూరు (ఎస్) మండలానికి చెందిన బట్టి పెళ్లి వెంకన్న గడ్డ చికిత్స కోసం జిల్లా కేంద్రంలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిని ఆశ్రయించాడు. అయితే అక్కడ నిర్వహించిన శస్త్రచికిత్స సరిగా చేయలేదని బాధితుడు ఆరోపిస్తున్నాడు. చికిత్స అనంతరం ఆరోగ్యం మరింత విషమించడంతో పరిస్థితి విషమించింది.
గత్యంతరం లేక వెంకన్నను కుటుంబ సభ్యులు హైదరాబాద్ కు తరలించగా, అక్కడ వైద్యులు అత్యవసరంగా మళ్లీ ఆపరేషన్ చేసి అతని ప్రాణాలను కాపాడినట్లు సమాచారం.
ఈ సందర్భంగా బాధితుడు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు. సూర్యాపేటలోని ప్రైవేట్ ఆసుపత్రి డబ్బులు తీసుకుని సరైన వైద్యం చేయలేదని, తన ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టిందని ఆరోపించాడు. ఈ విషయంపై ప్రశ్నిస్తే ఆసుపత్రి యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని కన్నీటి పర్యంతమయ్యాడు.
ఈ ఘటనపై జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వెంటనే స్పందించాలని బాధితుడు డిమాండ్ చేస్తున్నాడు. నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న ఆసుపత్రిపై కఠిన చర్యలు తీసుకుని, అవసరమైతే సీజ్ చేయాలని కోరుతున్నాడు. ఇకపై ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని స్థానికులు కూడా డిమాండ్ చేస్తున్నారు.
