పెట్రోల్ కొరతపై రూమర్లు.. ప్రజల్లో ఆందోళన – అసలు పరిస్థితి ఏమిటంటే?
హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ కొరత ఉందంటూ వస్తున్న వార్తలపై తెలంగాణ పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ స్పష్టత ఇచ్చింది. ప్రస్తుతం బంకుల వద్ద కనిపిస్తున్న భారీ రద్దీకి కారణం అసలు కొరత కాదని, తప్పుడు ప్రచారమేనని వెల్లడించింది.
రాష్ట్రంలో ఇంధన కొరత ఉందన్న వదంతులతో ప్రజలు ఒక్కసారిగా పెట్రోల్ బంకుల వద్దకు పరుగులు తీస్తున్నారు. ఈ భయాందోళనల కారణంగా సాధారణ రోజుల కంటే 2 నుంచి 3 రెట్లు ఎక్కువగా అమ్మకాలు జరుగుతున్నాయి. దీంతో కొన్ని బంకుల్లో నిల్వలు త్వరగా అయిపోతున్న పరిస్థితి కనిపిస్తోంది.
అయితే, ఇది సరఫరా లోపం వల్ల కాదని అసోసియేషన్ స్పష్టం చేసింది. HPCL, IOCL, BPCL వంటి ప్రధాన ఆయిల్ కంపెనీల వద్ద తగినంత నిల్వలు ఉన్నాయని, సరఫరా వ్యవస్థ సాధారణంగానే కొనసాగుతోందని తెలిపింది.
భారీ రద్దీ కారణంగా కొన్నిచోట్ల తాత్కాలికంగా స్టాక్ అయిపోతున్నా, దాన్ని కొరతగా భావించాల్సిన అవసరం లేదని పేర్కొంది. ఇది కేవలం డిమాండ్ ఒక్కసారిగా పెరగడం వల్ల తలెత్తిన తాత్కాలిక సమస్య మాత్రమేనని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది.
