ఖమ్మం జిల్లా సత్తుపల్లి కేంద్రంగా రూ. 547 కోట్ల సైబర్ క్రైమ్
నిందితులకు సహకరించిన ముగ్గురు బ్యాంక్ సిబ్బంది అరెస్ట్
సత్తుపల్లి: ఖమ్మం జిల్లా సత్తుపల్లి కేంద్రంగా కోట్లాది రూపాయల సైబర్ మోసం వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో నిందితులకు సహకరించిన ముగ్గురు బ్యాంక్ సిబ్బందిని పోలీసులు అరెస్ట్ చేశారు.
ఈ కేసుకు సంబంధించిన వివరాలను కల్లూరు ఏసీపీ వసుంధర యాదవ్ గురువారం మీడియాకు వెల్లడించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ముష్టిబండ గ్రామానికి చెందిన ఉడతనేని వికాస్ చౌదర్, అతని భార్య నాగప్రియ కలిసి ఈ భారీ సైబర్ మోసాలకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు.
వీరు తమ స్నేహితులు, పరిచయాల ద్వారా భారత్‌తో పాటు ఆస్ట్రేలియా వంటి విదేశాల్లో ఉన్న వ్యక్తుల మొబైల్ నంబర్లు, బ్యాంక్ అకౌంట్ వివరాలు సేకరించారు. అనంతరం ఆన్‌లైన్ గేమింగ్, ట్రేడింగ్, బెట్టింగ్ పేరుతో నమ్మబలికి, బాధితులను టెలిగ్రామ్ గ్రూపుల్లో చేర్చి మోసాలకు పాల్పడ్డారు.
ఇలా రెండు నుంచి మూడు సంవత్సరాల వ్యవధిలో సుమారు రూ. 547 కోట్లకు పైగా మోసం చేసినట్లు పోలీసులు గుర్తించారు.
మోసపూరితంగా సంపాదించిన ఈ డబ్బును హవాలా మార్గంలో విదేశాలకు తరలించినట్లు సమాచారం. ఈ క్రమంలో నిరుద్యోగులను డబ్బు ఆశ చూపించి వారి పేర్లపై బ్యాంక్ ఖాతాలు తెరిపించి, యూజర్ ఐడీలు, పాస్‌వర్డ్‌లు తమ వద్ద ఉంచుకుని సైబర్ నేరాలకు వినియోగించారు.
ఈ అకౌంట్ల ఓపెనింగ్‌కు సహకరించిన
- కాథలిక్ సిరియన్ బ్యాంక్ కస్టమర్ రిలేషన్ ఆఫీసర్ ఓర్సు కృప
- మందా శ్రీహరిబాబు
- బ్రాంచ్ ఆపరేషన్స్ మేనేజర్ జుంజునూరి రాధాకృష్ణ
లను పోలీసులు అరెస్ట్ చేశారు.
ఇప్పటికే ఈ కేసులో ఆరుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు, తాజా అరెస్టులతో మొత్తం సంఖ్య పెరిగింది. ఇంకా 20 మందికిపైగా ఈ కేసులో ప్రమేయం ఉన్నట్లు గుర్తించిన పోలీసులు, పరారీలో ఉన్న వారి కోసం గాలిస్తున్నారు.
ఏసీపీ వసుంధర యాదవ్, సీఐ తుమ్మలపల్లి శ్రీహరి కేసు దర్యాప్తును వేగవంతం చేశారు.
