లోక్‌సభలో 131వ రాజ్యాంగ సవరణ బిల్లు వీగింది.. ఎన్డీయేకు షాక్, మోదీ ప్రభుత్వానికి గట్టి ఎదురు దెబ్బ
న్యూఢిల్లీ: కేంద్రంలోని ఎన్డీయే కూటమి ప్రభుత్వానికి లోక్‌సభలో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మహిళా రిజర్వేషన్ అమలుకు అనుబంధంగా తీసుకొచ్చిన 131వ రాజ్యాంగ సవరణ బిల్లు సభలో ఆమోదం పొందకుండా వీగిపోయింది.
ఈ బిల్లుపై జరిగిన ఓటింగ్‌లో మొత్తం సభ్యుల్లో గణనీయ సంఖ్యలో ఎంపీలు పాల్గొన్నారు. బిల్లుకు అనుకూలంగా వచ్చిన ఓట్లు అవసరమైన మూడింట రెండో వంతు మెజార్టీకి తక్కువగా ఉండటంతో బిల్లు ఆమోదం పొందలేదు. రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదానికి అవసరమైన మెజార్టీ సాధించలేకపోవడం మోదీ సర్కార్‌కు పెద్ద షాక్‌గా భావిస్తున్నారు.
ఈ బిల్లును మహిళా రిజర్వేషన్ అమలును డీలిమిటేషన్ ప్రక్రియతో లింక్ చేయడాన్ని ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. డీలిమిటేషన్‌కు సంబంధం లేకుండా మహిళా రిజర్వేషన్ బిల్లును తీసుకురావాలని కాంగ్రెస్ పార్టీ సహా పలు ప్రతిపక్ష పార్టీలు స్పష్టం చేశాయి.
అయితే ప్రతిపక్షాల అభ్యంతరాలను పరిగణలోకి తీసుకోకుండా ప్రభుత్వం బిల్లును ఓటింగ్‌కు పెట్టింది. చివరికి అవసరమైన మెజార్టీ రాకపోవడంతో బిల్లు వీగిపోయింది.
ఈ పరిణామం పార్లమెంట్‌లో రాజకీయంగా కీలక మలుపుగా భావిస్తున్నారు. మహిళా రిజర్వేషన్ అమలుపై, అలాగే డీలిమిటేషన్ అంశంపై భవిష్యత్‌లో మరింత చర్చ, రాజకీయ ఉద్రిక్తతలు నెలకొనే అవకాశం ఉందని విశ్లేషకులు అంటున్నారు.
