“హెల్మెట్ వల్ల జుట్టు ఊడదు.. పెట్టుకోకపోతే ప్రాణం పోతుంది” – డీజీపీ శివధర్ రెడ్డి గట్టి హెచ్చరిక
హైదరాబాద్: రోడ్డు భద్రతపై తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. హెల్మెట్ పెట్టుకోవడంపై వాహనదారులు చెబుతున్న కారణాలు సిల్లీగా ఉన్నాయని అన్నారు.
“హెల్మెట్ పెట్టుకుంటే వెంట్రుకలు ఊడిపోతాయట, చెవులు వినిపించవట, తలనొప్పి వస్తుందట… ఈ మాటలు వింటుంటే ఆశ్చర్యంగా ఉంది. నేను జీవితంలో ఎప్పుడూ హెల్మెట్ పెట్టుకోలేదు. మరి నా జుట్టు ఎందుకు ఊడిపోయింది?” అని చమత్కరించారు. హెల్మెట్ వల్ల జుట్టు ఊడుతుందనేది పూర్తిగా అపోహ మాత్రమేనని స్పష్టం చేశారు.
హెల్మెట్ పెట్టుకోకపోతే మాత్రం ప్రాణాలు పోతాయనేది నిజమని హెచ్చరించారు. ప్రస్తుతం హత్యల కంటే రోడ్డు ప్రమాదాలులోనే మరణాలు ఎక్కువగా జరుగుతున్నాయని తెలిపారు.
పిల్లల చేతికి బైక్ ఇవ్వడం అంటే వారి ప్రాణాలను ప్రమాదంలో పెట్టడమేనని తల్లిదండ్రులకు సూచించారు. రాంగ్ రూట్‌లో ప్రయాణించడం మృత్యువును ఆహ్వానించడమేనని అన్నారు. ఎడమ వైపు నుంచి ఓవర్‌టేక్ చేయడం ప్రమాదకరమని, ఎప్పుడూ కుడి వైపే ఓవర్‌టేక్ చేయాలని సూచించారు.
ఫోర్ వీలర్ డ్రైవర్లు తప్పనిసరిగా సీట్ బెల్ట్ ధరించాలని చెప్పారు. రోడ్డు మీద డ్రైవింగ్ చేస్తూ మన డ్రైవింగ్ మాత్రమే కాదు, ఎదుటివారి డ్రైవింగ్‌ను కూడా గమనించాల్సిన అవసరం ఉందన్నారు. హైవే వాహనాలకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.
ఆటో డ్రైవర్లు కాకీ యూనిఫాం ధరించి విధుల్లోకి రావడం అభినందనీయం అని చెప్పారు. చివరగా “చేయి, కాలు పోయినా తిరిగి అమర్చుకోవచ్చు కానీ ప్రాణం పోతే తిరిగి రాదు. రోడ్డు భద్రత మన బాధ్యత” అని స్పష్టం చేశారు.
