సిగాచి బాధితులకు రూ.1 కోటి పరిహారం వచ్చే వరకు కంపెనీని వదిలిపెట్టం: మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి
పెద్దపల్లి జిల్లా, గోదావరిఖని: సంగారెడ్డి జిల్లా పాశమైలారం పారిశ్రామికవాడలోని సిగాచి పరిశ్రమలో జరిగిన ఘోర ప్రమాద బాధితులకు పూర్తిస్థాయిలో న్యాయం జరిగే వరకు ప్రభుత్వం వెనక్కి తగ్గబోదని రాష్ట్ర కార్మిక, ఉపాధి, శిక్షణ, ఫ్యాక్టరీలు మరియు గనుల శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి స్పష్టం చేశారు. బాధిత కుటుంబాలకు రూ.1 కోటి పరిహారం అందే వరకు సిగాచి యాజమాన్యంపై ప్రభుత్వ ఒత్తిడి కొనసాగుతుందని తెలిపారు.
పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ప్రెస్ క్లబ్లో నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడుతూ, సిగాచి ప్రమాదంలో 54 మంది కార్మికులు ప్రాణాలు కోల్పోవడం అత్యంత విషాదకరమని అన్నారు. ప్రమాదం జరిగిన వెంటనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా ఆసుపత్రికి వెళ్లి క్షతగాత్రులను పరామర్శించి, వారికి అత్యుత్తమ వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారని గుర్తు చేశారు.
మంత్రి శ్రీధర్ బాబు, దామోదర రాజనర్సింహాతో కలిసి తాను కూడా వెంటనే ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని సమీక్షించామని, బాధిత కుటుంబాలకు తక్షణ సహాయం, క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందేలా చర్యలు చేపట్టామని వివరించారు. ప్రభుత్వం అన్ని విధాలా బాధిత కుటుంబాలకు అండగా నిలిచిందని చెప్పారు.
సిగాచి యాజమాన్యాన్ని పలుమార్లు పిలిపించి బాధితులకు తగిన పరిహారం చెల్లించేలా ప్రభుత్వం ఒత్తిడి తీసుకొచ్చిందని మంత్రి తెలిపారు. ప్రభుత్వ నిరంతర ప్రయత్నాల ఫలితంగానే మృతి చెందిన కార్మికుల కుటుంబాలకు దాదాపు రూ.50 లక్షల చొప్పున పరిహారం అందిందన్నారు. యాజమాన్యం నిర్లక్ష్యంపై కఠిన చర్యలు తీసుకుని, పలు చట్టాల కింద కేసులు నమోదు చేసి కంపెనీ సీఎండీని అరెస్ట్ చేశామని వెల్లడించారు. ఫ్యాక్టరీల ఇన్స్పెక్టర్ కూడా తనిఖీలు నిర్వహించి చట్టపరమైన చర్యలు చేపట్టారని చెప్పారు.
బాధితులకు పూర్తి న్యాయం జరగాలనే ప్రభుత్వ వైఖరిని హైకోర్టులో కూడా స్పష్టం చేశామని మంత్రి పేర్కొన్నారు. బాధిత కుటుంబాలకు రూ.1 కోటి పరిహారం అందే వరకు ప్రభుత్వం తన ప్రయత్నాలను కొనసాగిస్తుందని తెలిపారు.
ఈ సందర్భంగా మాజీ మంత్రి హరీష్ రావు చేసిన వ్యాఖ్యలను మంత్రి తీవ్రంగా ఖండించారు. రాజకీయ ప్రయోజనాల కోసం అసత్య ప్రచారం చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రస్తావిస్తూ, కొండగట్టు ఆర్టీసీ బస్సు ప్రమాదంలో 60 మందికి పైగా భక్తులు మరణించినప్పుడు అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఎందుకు ఘటనాస్థలికి వెళ్లలేదని ప్రశ్నించారు. అలాగే ఇంటర్మీడియట్ ఫలితాల గందరగోళంతో 20 మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోయిన ఘటనలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఎందుకు సమర్థవంతమైన చర్యలు తీసుకోలేదో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
సిగాచి ప్రమాదంలో కాంగ్రెస్ ప్రభుత్వం చట్టప్రకారం తీసుకోవాల్సిన ప్రతి చర్యను తీసుకుందని, బాధిత కార్మికుల కుటుంబాలకు న్యాయం చేయడంలో ఎలాంటి రాజీ ఉండదని మంత్రి స్పష్టం చేశారు. “సిగాచి కార్మికులను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుంది. వారి కుటుంబాలకు పూర్తి న్యాయం జరిగే వరకు మా పోరాటం కొనసాగుతుంది. బాధిత కుటుంబాలకు రూ.1 కోటి పరిహారం అందే వరకు కంపెనీని వదిలిపెట్టం” అని మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి స్పష్టం చేశారు.
