₹4,200 కోట్లతో తెలంగాణలో నైపుణ్య విప్లవం.. ప్రతి నియోజకవర్గానికి అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్లు: మంత్రి డా. వివేక్ వెంకటస్వామి
మహబూబ్‌నగర్, జూన్ 24: తెలంగాణలో నైపుణ్యాభివృద్ధి, ఉపాధి అవకాశాల విస్తరణకు రాష్ట్ర ప్రభుత్వం భారీ స్థాయిలో చర్యలు చేపడుతోందని రాష్ట్ర కార్మిక, ఉపాధి, శిక్షణ, ఫ్యాక్టరీలు, గనులు మరియు భూగర్భ వనరుల శాఖ మంత్రి డా. గడ్డం వివేక్ వెంకటస్వామి తెలిపారు. మహబూబ్‌నగర్ జిల్లా రాజాపూర్ మండలం రంగారెడ్డిగూడెంలో నూతనంగా నిర్మించనున్న అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్ (ఏటీసీ) నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన అనంతరం ఆయన మాట్లాడారు.
రాష్ట్రంలో మూతపడే పరిస్థితికి చేరుకున్న ఐటీఐలను సుమారు రూ.2,200 కోట్ల వ్యయంతో ఆధునికీకరించి 65 అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్లుగా (ఏటీసీలు) అప్‌గ్రేడ్ చేసినట్లు మంత్రి వెల్లడించారు. అదేవిధంగా మరో రూ.2,000 కోట్లతో రాష్ట్రంలోని 53 నియోజకవర్గాల్లో కొత్త ఏటీసీలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిపారు.
ఇప్పటికే ఏర్పాటు చేసిన ఏటీసీలలో 90 శాతం వరకు అడ్మిషన్లు నమోదవుతున్నాయని, కొత్త కోర్సుల ప్రవేశంతో విద్యార్థుల్లో ఆసక్తి, డిమాండ్ గణనీయంగా పెరిగిందని చెప్పారు. విద్యతో పాటు సాంకేతిక నైపుణ్యాలను పెంపొందించుకున్న యువతకు మెరుగైన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని సూచించారు.
ప్రభుత్వం అమలు చేస్తున్న టామ్‌కామ్ (TOMCOM) కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తోందని, బడ్జెట్‌లో రూ.90 కోట్ల కేటాయింపుతో యువతకు అంతర్జాతీయ ప్రమాణాల నైపుణ్య శిక్షణ అందిస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. అలాగే కాకా ఫౌండేషన్ ద్వారా విద్యార్థులకు ఉపకార వేతనాలు అందిస్తున్నట్లు తెలిపారు.
జర్మన్, జపనీస్, గ్రీక్ వంటి విదేశీ భాషలను నేర్చుకోవడం ద్వారా విదేశాల్లో ఉపాధి అవకాశాలు మరింత పెరుగుతాయని మంత్రి అన్నారు. భాషా నైపుణ్యాలతో పాటు సాంకేతిక శిక్షణ అందించి వెయ్యి మంది విద్యార్థులను జర్మనీకి పంపించి ఉన్నత ఉద్యోగాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని వెల్లడించారు.
ఐటీఐలను ఏటీసీలుగా అభివృద్ధి చేసే కార్యక్రమంలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచిందని, రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న నమూనాను కేంద్ర ప్రభుత్వం కూడా ప్రశంసించిందని తెలిపారు. ఈ విధానాన్ని అధ్యయనం చేసేందుకు వివిధ రాష్ట్రాల ప్రతినిధులతో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసినట్లు, ఆ కమిటీకి తానే సారథ్యం వహిస్తున్నట్లు చెప్పారు.
ప్రస్తుత పోటీ ప్రపంచంలో డిగ్రీతో పాటు సాంకేతిక నైపుణ్యాలు కలిగిన యువతకు విస్తృతమైన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని మంత్రి పేర్కొన్నారు.
ఈ సందర్భంగా అనిరుధ్ రెడ్డి మాట్లాడుతూ, జడ్చర్ల నియోజకవర్గం విద్యారంగంలో వేగంగా అభివృద్ధి చెందుతోందన్నారు. యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్, ట్రిపుల్ ఐటీ, నవోదయ విద్యాలయం వంటి విద్యాసంస్థలు నియోజకవర్గానికి రానున్నాయని తెలిపారు.
రూ.42 కోట్ల వ్యయంతో నిర్మించనున్న ఏటీసీ వల్ల స్థానిక విద్యార్థులకు నాణ్యమైన సాంకేతిక విద్య, శిక్షణ అందుబాటులోకి వస్తుందని చెప్పారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీల మేరకు జడ్చర్ల నియోజకవర్గ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు.
