వలస కార్మికుల పిల్లల చెంతకే అంగన్వాడి సేవలు.. మొబైల్ అంగన్వాడి కేంద్రాలకు శ్రీకారం
విజయవంతమైతే మరిన్ని మొబైల్ అంగన్వాడి వాహనాలు తీసుకొస్తాం: మంత్రి డా. గడ్డం వివేక్ వెంకటస్వామి
వలస కార్మికుల పిల్లలకు పోషకాహారం, ఆరోగ్య సంరక్షణ, ప్రీ-స్కూల్ విద్య వంటి అంగన్వాడి సేవలను నేరుగా వారి చెంతకు తీసుకెళ్లేందుకు తెలంగాణ ప్రభుత్వం మొబైల్ అంగన్వాడి కేంద్రాలకు శ్రీకారం చుట్టింది. కార్మిక, ఉపాధి, శిక్షణ, గనుల శాఖ మంత్రి డా. గడ్డం వివేక్ వెంకటస్వామి, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్కతో కలిసి మంగళవారం ఎంసీఆర్ హెచ్ఆర్డీలో మొబైల్ అంగన్వాడి వాహనాన్ని జెండా ఊపి ప్రారంభించారు. ఈ వాహనం మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాలోని ఇందిరమ్మ కాలనీలో సేవలు అందించనుంది.
ఈ సందర్భంగా మంత్రి డా. వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ, ఉపాధి కోసం ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వలస వెళ్లే కార్మికుల పిల్లలు ప్రభుత్వ సంక్షేమ పథకాలకు దూరం కాకుండా ఉండేందుకు మొబైల్ అంగన్వాడి కేంద్రాలు ఎంతో ఉపయోగపడతాయని తెలిపారు. అంగన్వాడి సేవలను అవసరమైన ప్రాంతాలకు తీసుకెళ్లాలన్న మంత్రి సీతక్క ఆలోచన అభినందనీయమని పేర్కొన్నారు.
అంగన్వాడి కేంద్రాలు చిన్నారుల ఆరోగ్యకరమైన ఎదుగుదలలో కీలక పాత్ర పోషిస్తున్నాయని, మొబైల్ అంగన్వాడి వాహనాల ద్వారా కార్మికులు నివసించే ప్రాంతాల్లోనే పోషకాహారం, ఆరోగ్య సేవలు, ప్రీ-స్కూల్ విద్య అందించడం వల్ల వేలాది మంది చిన్నారులు లబ్ధి పొందుతారని మంత్రి వివరించారు.
మంచి ఉద్దేశంతో ప్రారంభించిన ఈ కార్యక్రమం విజయవంతమైతే రాష్ట్రవ్యాప్తంగా మరిన్ని మొబైల్ అంగన్వాడి వాహనాలను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మంత్రి వివేక్ వెంకటస్వామి వెల్లడించారు.
కార్మికుల సంక్షేమం అంటే కేవలం ఉపాధి, వేతనాలకే పరిమితం కాదని, వారి కుటుంబాల ఆరోగ్యం, పిల్లల విద్య, భవిష్యత్తు కూడా ప్రభుత్వ బాధ్యతేనని ఆయన అన్నారు. ప్రజాప్రయోజన కార్యక్రమాల అమలులో మహిళా, శిశు సంక్షేమ శాఖతో కలిసి కార్మిక శాఖ పూర్తి సహకారం అందిస్తుందని స్పష్టం చేశారు.
మంత్రి సీతక్క మాట్లాడుతూ, అంగన్వాడి కేంద్రాలు లేని ప్రాంతాల్లో నివసించే చిన్నారులు, ముఖ్యంగా నగరాలకు వలస వచ్చే కార్మికుల పిల్లలు ప్రభుత్వ సేవలకు దూరమవుతున్నారని చెప్పారు. ఒక్క చిన్నారి కూడా పోషకాహారం, ఆరోగ్య సంరక్షణ, ప్రీ-స్కూల్ విద్య వంటి సేవలకు దూరం కాకూడదనే లక్ష్యంతో మొబైల్ అంగన్వాడి కేంద్రాలను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వం చిన్నారుల సమగ్ర అభివృద్ధికి కట్టుబడి ఉందని ఆమె పేర్కొన్నారు.
