బీఆర్ఎస్ను కబ్జా చేసేందుకే హరీశ్–కేటీఆర్ పోటీ: మంత్రి వివేక్ వెంకటస్వామి
సింగరేణిని దోచుకుని సిద్దిపేట, సిరిసిల్లాకు నిధులు తరలించారు
బీఆర్ఎస్ పార్టీ ఖాతాలోకి ₹1,400 కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయో చెప్పాలి
మందమర్రి ప్రెస్మీట్లో మంత్రి డాక్టర్ గడ్డం వివేక్ వెంకటస్వామి
మందమర్రి, జూలై 13: బీఆర్ఎస్ పార్టీని ఎవరు కబ్జా చేయాలనే పోటీలో కేటీఆర్, హరీశ్ రావు మధ్య తీవ్ర ఆధిపత్య పోరు కొనసాగుతోందని కార్మిక, ఉపాధి, శిక్షణ, కర్మాగారాలు మరియు గనుల శాఖ మంత్రి డాక్టర్ గడ్డం వివేక్ వెంకటస్వామి ఆరోపించారు. ఒకరోజు కేటీఆర్ ప్రెస్‌మీట్ పెడితే, మరుసటి రోజే అదే అంశంపై హరీశ్ రావు మీడియా ముందుకు వస్తున్నారని, ఈ రాజకీయ పోరాటాన్ని తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారని అన్నారు.
సోమవారం మందమర్రిలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ బీఆర్ఎస్ నాయకత్వం, గత కేసీఆర్ ప్రభుత్వ పనితీరుపై తీవ్ర విమర్శలు చేశారు.
బ్యారేజీల్లో నీటిని నిల్వ చేయకుండానే పంపింగ్ చేయవచ్చని ఇప్పుడు బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారని, అలాంటప్పుడు వేల కోట్ల రూపాయల ప్రజాధనంతో బ్యారేజీల నిర్మాణం ఎందుకు చేపట్టారో కేసీఆర్, హరీశ్ రావు, కేటీఆర్ ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో రాష్ట్రంపై భారీ అప్పుల భారం మోపి, ఇప్పుడు వాటి అవసరం లేదన్నట్లుగా మాట్లాడటం ప్రజలను తప్పుదోవ పట్టించడమేనని విమర్శించారు.
కాళేశ్వరం ప్రాజెక్టు రూపకల్పన, ఇంజినీరింగ్ లోపాల వల్లే అది కుంగిపోయిందని మంత్రి ఆరోపించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ప్రత్యేక చర్చకు ఆహ్వానించినప్పటికీ కేసీఆర్ హాజరుకాకపోవడం బాధ్యతారాహిత్యమని అన్నారు. కాకా వెంకటస్వామి సూచించినట్లుగా తుమ్మిడిహెట్టి వద్ద ప్రాజెక్టు నిర్మించి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదన్నారు. ప్రస్తుత ఎత్తిపోతల పథకం వల్ల సంవత్సరానికి సుమారు ₹10,000 కోట్ల విద్యుత్ భారం రాష్ట్రంపై పడుతోందని, కాంట్రాక్టర్లను లాభపరిచేందుకే బీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేసిందని విమర్శించారు.
తెలంగాణ ఉద్యమ సమయంలో బీఆర్ఎస్ పార్టీ ఖాతాలో ఒక్క రూపాయి కూడా లేదని చెప్పిన నాయకులు, పదేళ్ల పాలన ముగిసే సమయానికి పార్టీ ఖాతాలో ₹1,400 కోట్లు ఎలా చేరాయో ప్రజలకు వెల్లడించాలని మంత్రి ప్రశ్నించారు. హైదరాబాద్ పరిసరాల్లో భూముల వ్యవహారాల ద్వారా అక్రమంగా ఆస్తులు కూడబెట్టారని, దీనిపై కేసీఆర్ కుటుంబం ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
సింగరేణి ఒకప్పుడు బీఐఎఫ్ఆర్ పరిధిలోకి వెళ్లిన క్లిష్ట సమయంలో అప్పటి కేంద్ర మంత్రి కాకా వెంకటస్వామి చొరవతో అప్పటి ప్రధాని పి.వి. నరసింహారావును ఒప్పించి ఎన్టీపీసీ ద్వారా ₹400 కోట్ల రుణం ఇప్పించి సంస్థను కాపాడారని గుర్తు చేశారు. ఆ నిర్ణయం వల్ల లక్ష మంది కార్మికుల ఉద్యోగాలు రక్షించబడ్డాయని, నేడు కార్మికులకు పీఎఫ్, పెన్షన్ లభిస్తున్నాయంటే అందులో కాకా వెంకటస్వామి పాత్ర కీలకమని చెప్పారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నాటి ఎమ్మెల్యే బాల్క సుమన్ మద్దతుతో సింగరేణికి చెందిన డీఎంఎఫ్టీ, సీఎస్ఆర్ నిధులను సిద్దిపేట, సిరిసిల్ల, గజ్వేల్ ప్రాంతాలకు మళ్లించారని ఆరోపించారు. కాళేశ్వరం బ్యాక్‌వాటర్‌లతో నష్టపోయిన దేవులవాడ, బబ్బర్ చిల్క, లక్ష్మీపూర్, శివారం రైతులకు ఐదేళ్లపాటు పరిహారం ఇవ్వలేదని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ₹33 కోట్ల భూసేకరణ పరిహారం విడుదల చేయడంతో పాటు శివారం రైతుల కోసం మరో ₹2.08 కోట్లు మంజూరు చేసినట్లు తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థలకు కోల్ బ్లాకుల కేటాయింపులో గత ప్రభుత్వం అవకాశాన్ని కోల్పోయిందని, ప్రిఫరెన్షియల్ అలాట్మెంట్ సాధించడంలో విఫలమైందన్నారు. పార్లమెంట్లో బొగ్గు గనుల వేలానికి మద్దతు ఇచ్చి, రాష్ట్రంలో మాత్రం వేలాలను వ్యతిరేకించడం బీఆర్ఎస్ ద్వంద్వ వైఖరికి నిదర్శనమని విమర్శించారు. బాల్క సుమన్‌కు సింగరేణి ఎనర్జీ మంత్రిత్వ శాఖ పరిధిలో ఉంటుందన్న కనీస అవగాహన కూడా లేదని, క్యాతన్‌పల్లిలో హింసను ప్రేరేపించేలా వ్యవహరించారని ఆరోపించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహకారంతో తాడిచర్ల–2, ఆర్కే–5, కేకే–6 కోల్ మైన్లను సాధించామని, అటవీ అనుమతులు వచ్చిన వెంటనే పనులు ప్రారంభమై వేలాది ఉద్యోగాలు లభిస్తాయని మంత్రి తెలిపారు. గతంలో తాడిచర్ల గనిని “బొగ్గు నాణ్యత సరిగా లేదు” అనే కారణంతో ప్రైవేట్ సంస్థకు అప్పగించి వందల కోట్ల రూపాయలు దుర్వినియోగం చేశారని ఆరోపించారు.
ప్రస్తుతం డీఎంఎఫ్టీ, సీఎస్ఆర్ నిధులను చెన్నూరు, మందమర్రి, క్యాతన్‌పల్లి తదితర సింగరేణి ప్రభావిత ప్రాంతాల్లోనే రోడ్లు, డ్రైనేజీలు, తాగునీటి వంటి మౌలిక వసతుల అభివృద్ధికి వినియోగిస్తున్నామని మంత్రి స్పష్టం చేశారు. మందమర్రి, చెన్నూరులో అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లను ఏర్పాటు చేసి ఆధునిక నైపుణ్య శిక్షణ అందిస్తున్నామని, జర్మన్ భాషా శిక్షణ పూర్తి చేసిన యువతకు రాబోయే మూడు నుంచి నాలుగు నెలల్లో జర్మనీలో నెలకు సుమారు ₹2 లక్షల వేతనంతో ఉద్యోగాలు కల్పించే బాధ్యత తీసుకుంటానని తెలిపారు.
జైపూర్ థర్మల్ పవర్ ప్లాంట్ విస్తరణతో మరో 5,000 ఉద్యోగాలు సృష్టించబడతాయని, అమృత్ పథకం కింద ఇంటింటికీ తాగునీటి కనెక్షన్లు అందిస్తున్నామని చెప్పారు. పుష్కరాల నిధులతో ₹6.30 కోట్ల వ్యయంతో అంబేద్కర్ విగ్రహం నుంచి ట్యాంక్‌బండ్ వరకు అభివృద్ధి పనులు త్వరలో ప్రారంభమవుతాయని వెల్లడించారు. తప్పుడు ప్రచారాలను నమ్మకుండా ప్రజలు అభివృద్ధికి సహకరించాలని మంత్రి డాక్టర్ గడ్డం వివేక్ వెంకటస్వామి విజ్ఞప్తి చేశారు.
