హుస్నాబాద్‌లో ఏటీసీ భవన నిర్మాణానికి భూమిపూజ
విద్యార్థులకు నెలకు రూ.2 వేల స్టైఫండ్ – జర్మన్ భాష శిక్షణ కేంద్రం ఏర్పాటు – డ్రైవింగ్ స్కూల్ ద్వారా 10 వేల మందికి శిక్షణ: మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి
సిద్ధిపేట, జూలై 10: తెలంగాణ యువతకు ప్రపంచ స్థాయి నైపుణ్య శిక్షణ అందించి దేశ, విదేశాల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని కార్మిక, ఉపాధి, శిక్షణ, కర్మాగారాలు మరియు గనుల శాఖ మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి తెలిపారు. హుస్నాబాద్‌లో ఏర్పాటు చేస్తున్న అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ (ఏటీసీ)లో శిక్షణ పొందే యువతకు వంద శాతం ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు తమ శాఖతో పాటు తెలంగాణ ఓవర్సీస్ మాన్పవర్ కంపెనీ (టామ్‌కామ్) సిద్ధంగా ఉందని ఆయన స్పష్టం చేశారు.
సిద్ధిపేట జిల్లా హుస్నాబాద్‌లో శుక్రవారం రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌తో కలిసి ఏటీసీ భవన నిర్మాణానికి మంత్రి డా. వివేక్ వెంకటస్వామి భూమిపూజ నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, కృత్రిమ మేధ (ఏఐ) ప్రభావంతో ఐటీ రంగంలో ఉద్యోగాల స్వరూపం మారుతోందని, భవిష్యత్తులో నైపుణ్యం కలిగిన బ్లూ కాలర్ ఉద్యోగులకు ప్రపంచవ్యాప్తంగా భారీ డిమాండ్ ఏర్పడనుందని అన్నారు. ఈ అవసరాన్ని దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి నాయకత్వంలో రూ.4 వేల కోట్ల వ్యయంతో రాష్ట్రవ్యాప్తంగా 119 అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.
పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా రోబోటిక్స్, ఆటోమేషన్, హైటెక్ వెల్డింగ్, సీఎన్సీ మెషినింగ్, సెమీకండక్టర్ టెక్నీషియన్ వంటి అత్యాధునిక కోర్సులను ఏటీసీల్లో ప్రవేశపెడుతున్నామని చెప్పారు. నైపుణ్యాభివృద్ధి రంగంలో తెలంగాణ దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు పొందిందని, కొత్త కోర్సుల రూపకల్పన కోసం కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీకి తనను చైర్మన్‌గా నియమించిందని తెలిపారు. అలాగే పీఎం-సేతు పథకం కింద తెలంగాణకు మూడు క్లస్టర్లు మంజూరయ్యాయని, దీని ద్వారా రాష్ట్రానికి గణనీయమైన నిధులు అందనున్నాయని పేర్కొన్నారు.
జర్మనీలో ప్రతి ఏడాది సుమారు ఐదు లక్షల ఉద్యోగ అవకాశాలు అందుబాటులో ఉన్నాయని, సాంకేతిక నైపుణ్యాలతో పాటు జర్మన్ భాషలో శిక్షణ పొందిన తెలంగాణ యువతకు అక్కడ ఉపాధి కల్పించేందుకు జర్మనీ ప్రతినిధులు ముందుకు వచ్చారని మంత్రి వెల్లడించారు. ఇప్పటికే మందమర్రిలో 100 మంది యువతకు జర్మన్ భాషలో శిక్షణ ఇస్తున్నామని, మరో మూడు నుంచి నాలుగు నెలల్లో వారిని జర్మనీలో ఉద్యోగాలకు పంపే ప్రక్రియ పూర్తవుతుందని తెలిపారు.
హుస్నాబాద్‌లో కూడా త్వరలో జర్మన్ భాష శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని ప్రకటించిన మంత్రి, శిక్షణ కేంద్రం సిద్ధమైతే అధ్యాపకులను పంపించడంతో పాటు శిక్షణ ఖర్చును తమ శాఖ భరిస్తుందని తెలిపారు. హుస్నాబాద్ నుంచి కనీసం 500 మంది యువతను జర్మనీలో ఉద్యోగాలకు పంపగలిగితే అది రాష్ట్రానికి ఆదర్శ నమూనాగా నిలుస్తుందని అన్నారు.
విదేశీ ఉద్యోగాల పేరుతో ప్రైవేటు ఏజెంట్లకు లక్షల రూపాయలు చెల్లించి మోసపోవద్దని యువతకు మంత్రి సూచించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని టామ్‌కామ్ ద్వారా విదేశీ ప్రభుత్వాలు, సంస్థలతో నేరుగా ఒప్పందాలు కుదుర్చుకుని పూర్తి పారదర్శకతతో ఉద్యోగాలు కల్పిస్తున్నామని చెప్పారు. టామ్‌కామ్ విస్తరణ కోసం ముఖ్యమంత్రి రూ.90 కోట్లు కేటాయించారని తెలిపారు.
ఆర్థిక ఇబ్బందుల వల్ల శిక్షణను మధ్యలో నిలిపివేయకుండా ఏటీసీ విద్యార్థులకు నెలకు రూ.2 వేల స్టైఫండ్ అందించాలని ప్రభుత్వం నిర్ణయించిందని మంత్రి తెలిపారు. శిక్షణను పూర్తి చేసిన ప్రతి యువకుడికి మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు.
హుస్నాబాద్ యువతకు మరిన్ని ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రత్యేక డ్రైవింగ్ స్కూల్‌ను ఏర్పాటు చేస్తామని మంత్రి ప్రకటించారు. రెండేళ్ల డ్రైవింగ్ అనుభవం ఉన్న వారికి ప్రత్యేక శిక్షణ ఇచ్చి విదేశీ ఉద్యోగాలకు పంపేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. డ్రైవర్లకు భారీ వేతనాలతో సుమారు 10 వేల ఉద్యోగ అవకాశాలు అందుబాటులో ఉన్నాయని, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సహకారంతో ఈ డ్రైవింగ్ స్కూల్‌ను త్వరలో ప్రారంభిస్తామని చెప్పారు.
తెలంగాణ ఉద్యమ సమయంలో తాను, మంత్రి పొన్నం ప్రభాకర్ కలిసి పనిచేశామని మంత్రి వివేక్ గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో కలిగే ప్రయోజనాలను అప్పటి ప్రధాని డా. మన్మోహన్ సింగ్, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ దృష్టికి తీసుకెళ్లేందుకు కృషి చేశామని తెలిపారు. హుస్నాబాద్ ప్రజలు తన తండ్రి, మాజీ కేంద్ర మంత్రి జి. వెంకటస్వామిని నాలుగు సార్లు ఎంపీగా గెలిపించారని, ఈ ప్రాంతంతో తమ కుటుంబానికి ప్రత్యేక అనుబంధం ఉందని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ, హుస్నాబాద్‌ను విద్య, వైద్యం, వ్యవసాయం, ఉపాధి, పర్యాటకం, పారిశ్రామిక రంగాల్లో ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమన్నారు. హుస్నాబాద్‌కు ఏటీసీని మంజూరు చేసి భవన నిర్మాణానికి చర్యలు తీసుకున్న మంత్రి డా. వివేక్ వెంకటస్వామికి ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలిపారు. ఏటీసీ నిర్మాణాన్ని వేగంగా పూర్తి చేసి యువతకు నాణ్యమైన శిక్షణతో పాటు ఉద్యోగ అవకాశాలు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు.
