కాళేశ్వరం వైఫల్యానికి బాధ్యత ఎవరిది? – హరీశ్‌రావు ముందుగా తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలి: మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి
కేటీఆర్, హరీశ్‌రావు, కవిత మధ్య మీడియాలో చోటు కోసం పోటీ నడుస్తోంది
సిద్ధిపేట, జూలై 10: తెలంగాణలో మూడు నెలల్లో నీటిపారుదల శాఖలో మార్పులు తీసుకొస్తానంటూ మాజీ మంత్రి హరీశ్‌రావు చేసిన వ్యాఖ్యలపై కార్మిక, ఉపాధి, శిక్షణ, ఫ్యాక్టరీస్ మరియు గనుల శాఖ మంత్రి, సిద్ధిపేట జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి తీవ్రంగా స్పందించారు. పదేళ్లు అధికారంలో ఉండి, మూడున్నరేళ్లకు పైగా నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేసిన హరీశ్‌రావు అప్పట్లో ఏ మార్పులు తీసుకొచ్చారో తెలంగాణ ప్రజలకు వివరించాలని ఆయన డిమాండ్ చేశారు.
హరీశ్‌రావు ఇప్పుడు మూడు నెలల్లోనే అద్భుతాలు చేస్తానని చెబుతున్నారని, అంతటి సామర్థ్యం ఉంటే బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో నీటిపారుదల శాఖను ఎందుకు గాడిలో పెట్టలేకపోయారో సమాధానం చెప్పాలని మంత్రి ప్రశ్నించారు. అలాగే, నీటిపారుదల శాఖ నుంచి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హరీశ్‌రావును ఎందుకు తప్పించారో కూడా ప్రజలకు చెప్పాలని అన్నారు.
కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు హరీశ్‌రావు నీటిపారుదల మంత్రిగా ఉన్న సమయంలోనే నిర్మించబడిందని మంత్రి గుర్తు చేశారు. అప్పటి గవర్నర్ ఈ.ఎస్.ఎల్. నరసింహన్ సైతం హరీశ్‌రావును “కాళేశ్వరరావు” అని ప్రశంసించారని పేర్కొన్నారు. అయితే ప్రస్తుతం అదే కాళేశ్వరం ప్రాజెక్టు కుంగిపోయిందని, దీనికి బాధ్యత ఎవరు వహిస్తారని ప్రశ్నించారు.
“హరీశ్‌రావు ముందుగా తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలి. తన హయాంలో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు వైఫల్యాన్ని అంగీకరించి బాధ్యత తీసుకోవాలి” అని మంత్రి డా. వివేక్ వెంకటస్వామి డిమాండ్ చేశారు.
బీఆర్ఎస్ పాలనలో కాంట్రాక్టర్లు మాత్రమే లబ్ధి పొందారని ఆరోపించిన మంత్రి, “మూడు నెలల్లో నీటిపారుదల శాఖను మార్చేస్తానని చెబుతున్న హరీశ్‌రావు మళ్లీ కాంట్రాక్టర్ల ప్రయోజనాల కోసమే మంత్రి కావాలనుకుంటున్నారా?” అని ప్రశ్నించారు.
ప్రజలు బీఆర్ఎస్‌ను ఐదేళ్ల పాటు ప్రతిపక్షంలో కూర్చోబెట్టారని, అయినప్పటికీ ప్రజా సమస్యలపై నిర్మాణాత్మకంగా వ్యవహరించకుండా రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేయడమే ఆ పార్టీ నాయకుల ప్రధాన లక్ష్యంగా మారిందని విమర్శించారు.
కేటీఆర్ ఒక ప్రెస్‌మీట్ నిర్వహిస్తే వెంటనే హరీశ్‌రావు మరో ప్రెస్‌మీట్ పెడుతున్నారని, మధ్యలో కవిత కూడా మీడియా ముందుకు వస్తున్నారని పేర్కొంటూ, “కేటీఆర్, హరీశ్‌రావు, కవిత మధ్య మీడియాలో ఎవరు ఎక్కువ ప్రచారం పొందాలనే పోటీ నడుస్తోంది. ప్రజా సమస్యల కంటే ప్రచారానికే వారు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు” అని ఎద్దేవా చేశారు.
ఏ అంశంపై మాట్లాడాలో కూడా బీఆర్ఎస్ నాయకులకు స్పష్టత లేదని మంత్రి విమర్శించారు. ఏదో ఒక అంశాన్ని పట్టుకుని కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేయడం కాకుండా, ముందుగా తమ పదేళ్ల పాలనలో నీటిపారుదల శాఖ ఎందుకు విఫలమైందో తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలని మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి అన్నారు.
