దేవాదాయ శాఖలో డిజిటల్ సంస్కరణలకు వేగం.. TAIMSను మరింత సమర్థవంతంగా తీర్చిదిద్దాలి: మంత్రి కొండా సురేఖ
యాదగిరిగుట్ట ట్రస్ట్ బోర్డు డ్రాఫ్ట్ రూల్స్‌పై సమీక్ష.. భక్తులకు పారదర్శక, వేగవంతమైన సేవలే ప్రభుత్వ లక్ష్యం
దేవాదాయ శాఖలో సాంకేతికత ఆధారిత పరిపాలనకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, భక్తులకు వేగవంతమైన, పారదర్శకమైన సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి శ్రీమతి కొండా సురేఖ అన్నారు. రాష్ట్రంలోని దేవాలయాల పరిపాలనను పూర్తిస్థాయిలో డిజిటలీకరించేందుకు అమలు చేస్తున్న **దేవాలయ పరిపాలన సమాచార నిర్వహణ వ్యవస్థ (TAIMS)**తో పాటు యాదగిరిగుట్ట ట్రస్ట్ బోర్డుకు సంబంధించిన తెలంగాణ ధార్మిక మరియు హిందూ ధార్మిక సంస్థలు, దేవాదాయాల (సవరణ) చట్టం–2025 ముసాయిదా నియమావళిపై సోమవారం బంజారాహిల్స్‌లోని తన క్యాంపు కార్యాలయంలో మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు.
సమావేశంలో దేవాదాయ శాఖ ప్రధాన కార్యదర్శి శైలజా రామయ్యర్, డైరెక్టర్ హనుమంతరావు, యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం ఈవో భవానీ శంకర్‌తో పాటు దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
మంత్రి అధికారులతో కలిసి TAIMS ద్వారా రాష్ట్రంలోని దేవాలయాల పరిపాలనను పూర్తిస్థాయిలో డిజిటలీకరించేందుకు చేపడుతున్న చర్యలు, వివిధ మాడ్యూళ్ల రూపకల్పన, అమలులో ఎదురవుతున్న సమస్యలు, వాటి పరిష్కార మార్గాలపై సవివరంగా చర్చించారు. దేవాలయాల పరిపాలన, ఉద్యోగుల సేవా వివరాలు, దేవాలయ భూములు, ఆస్తుల నిర్వహణ, ఆదాయ–వ్యయాల నమోదు, ఈ-ఆఫీస్ విధానం, భక్తులకు అందించే సేవలను మరింత వేగవంతంగా, పారదర్శకంగా అందించేందుకు TAIMSను సమర్థవంతంగా వినియోగించాలంటూ అధికారులు ఇచ్చిన ప్రజెంటేషన్‌ను మంత్రి పరిశీలించి పలు సూచనలు చేశారు.
ఈ సందర్భంగా మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ, డిజిటల్ విధానాల ద్వారా దేవాదాయ శాఖను మరింత ఆధునికీకరించి, పరిపాలనలో నాణ్యతను పెంచేలా TAIMS వ్యవస్థను తీర్చిదిద్దాలని అధికారులను ఆదేశించారు. క్షేత్రస్థాయిలో పనిచేసే సిబ్బందికి అవసరమైన శిక్షణ కార్యక్రమాలు నిర్వహించి, సాంకేతిక వ్యవస్థలను సమర్థవంతంగా వినియోగించేలా కార్యాచరణ రూపొందించాలని సూచించారు.
అనంతరం యాదగిరిగుట్ట ట్రస్ట్ బోర్డుకు సంబంధించిన తెలంగాణ ధార్మిక మరియు హిందూ ధార్మిక సంస్థలు, దేవాదాయాల (సవరణ) చట్టం–2025 ముసాయిదా నియమావళిపై సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు. యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం అభివృద్ధి, సమర్థవంతమైన పరిపాలన, భక్తులకు మెరుగైన సేవలందించే లక్ష్యాలకు అనుగుణంగా నియమావళిని రూపొందించాలని మంత్రి సూచించారు.
చట్టపరమైన అంశాలు, పరిపాలనా అవసరాలు, భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ముసాయిదా నియమాలను మరింత మెరుగుపరచాలని అధికారులను ఆదేశించారు. ట్రస్ట్ బోర్డు పనితీరు పారదర్శకంగా, జవాబుదారీతనంతో, సమర్థవంతంగా కొనసాగేలా నియమావళి ఉండాలని, యాదాద్రి దేవస్థానం విశిష్టతకు అనుగుణంగా పరిపాలనా వ్యవస్థను మరింత బలోపేతం చేసేలా నిబంధనలను రూపొందించాలని స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం, వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామి దేవస్థానాల మధ్య పరస్పర బదిలీల ద్వారా నియామక ఉత్తర్వులు పొందిన ఉద్యోగులు దేవాదాయ శాఖ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో మంత్రి కొండా సురేఖను మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు.
ఉద్యోగుల సంక్షేమం, వారి న్యాయమైన సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని మంత్రి కొండా సురేఖ ఈ సందర్భంగా పేర్కొన్నారు. పరిపాలనా సామర్థ్యాన్ని పెంపొందించడంతో పాటు ఉద్యోగుల సంక్షేమానికి సమాన ప్రాధాన్యం ఇస్తూ ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటోందని ఆమె స్పష్టం చేశారు.
