నీటిని కాపాడితేనే ఎల్‌నినోపై విజయం: మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి
ప్రత్యామ్నాయ పంటలు, నీటి సంరక్షణ, శాఖల సమన్వయంతో వర్షాభావాన్ని ఎదుర్కోవాలి – సంగారెడ్డిలో ఉమ్మడి మెదక్ జిల్లా ఎల్‌నినో సమీక్ష సమావేశంలో మంత్రి పిలుపు
సంగారెడ్డి, జూలై 20: రాష్ట్రంలో ఎల్‌నినో ప్రభావంతో ఏర్పడే వర్షాభావ పరిస్థితులను సమర్థంగా ఎదుర్కోవాలంటే నీటి సంరక్షణే ప్రధాన ఆయుధమని శక్తి (కార్మిక, ఉపాధి, శిక్షణ & ఫ్యాక్టరీస్) మరియు గనుల శాఖ మంత్రి, ఉమ్మడి మెదక్ జిల్లా ఇన్‌చార్జి మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి అన్నారు. వర్షాభావ ప్రభావాన్ని తగ్గించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో యుద్ధప్రాతిపదికన పనిచేయాలని, ముందస్తు కార్యాచరణ ప్రణాళికలతో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు సోమవారం సంగారెడ్డి జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో నిర్వహించిన ఉమ్మడి మెదక్ జిల్లా ఎల్‌నినో కంటింజెన్సీ సమీక్ష సమావేశంలో మంత్రి మెదక్, సంగారెడ్డి జిల్లాల పరిస్థితులను శాఖల వారీగా సమీక్షించారు. ఎల్‌నినో ప్రభావాన్ని తగ్గించేందుకు అమలు చేయాల్సిన ప్రత్యామ్నాయ కార్యాచరణ ప్రణాళికపై అధికారులు, ప్రజాప్రతినిధులతో విస్తృతంగా చర్చించారు.
మంత్రి మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా ప్రభావం చూపే సహజ వాతావరణ పరిణామమైన ఎల్‌నినో ఈసారి “సూపర్ ఎల్‌నినో”గా మారే అవకాశాలు ఉన్నాయని నిపుణులు హెచ్చరిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం ముందస్తు చర్యలకు అత్యంత ప్రాధాన్యం ఇస్తోందన్నారు. లోటు వర్షపాతం, నీటి కొరత, పంటలపై ప్రతికూల ప్రభావం వంటి పరిస్థితులను ముందుగానే అంచనా వేసి శాఖల వారీగా కార్యాచరణ ప్రణాళికలను సిద్ధం చేయాలని సూచించారు.
వ్యవసాయ, ఉద్యానవన, పశుసంవర్ధక, గ్రామీణాభివృద్ధి, తాగునీటి సరఫరా, భూగర్భ జలాలు, విద్యుత్, ఆరోగ్య శాఖలు పరస్పర సమన్వయంతో పనిచేసి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని మంత్రి ఆదేశించారు.
రైతులు తక్కువ నీటితో సాగయ్యే ప్రత్యామ్నాయ పంటలు, అంతర్ పంటల సాగుపై దృష్టి సారించాలని, వాటిపై విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు. ఒక ఎకరం వరి సాగుకు అవసరమైన నీటితో నాలుగు ఎకరాల ఆయిల్‌పామ్ లేదా ఎనిమిది ఎకరాల కంది పంట సాగు చేయవచ్చని పేర్కొన్నారు. పరిస్థితులకు అనుగుణంగా పంటల మార్పిడిపై రైతులకు స్పష్టమైన మార్గదర్శకాలు అందించాలని అధికారులను ఆదేశించారు.
రైతుల్లో అవగాహన పెంచేందుకు వీడియో రీల్స్, నాటక ప్రదర్శనలు, సామాజిక మాధ్యమాలు వంటి అన్ని ప్రచార సాధనాలను వినియోగించాలని సూచించారు. కోతుల బెడద కారణంగా రైతులు పంటల మార్పిడికి వెనుకంజ వేస్తున్న ప్రాంతాల్లో ఆ సమస్య పరిష్కారానికి కూడా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
వచ్చే మూడు నెలల్లో వర్షాలు తగ్గితే దాని ప్రభావం వచ్చే ఏడాది జూన్ వరకు కొనసాగే అవకాశం ఉందని, ముఖ్యంగా తాగునీటి కొరత తీవ్రంగా ఎదురయ్యే ప్రమాదం ఉందని మంత్రి హెచ్చరించారు. అందువల్ల ఇప్పటి నుంచే నీటి వనరుల సంరక్షణ, తాగునీటి నిర్వహణ, ప్రత్యామ్నాయ ప్రణాళికల అమలు, నీటి వృథా నివారణపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. బోర్‌వెల్‌ల రీచార్జ్, వర్షపు నీటి సంరక్షణ, భూగర్భ జలాల పరిరక్షణ, నీటి వినియోగంలో పొదుపు వంటి కార్యక్రమాలను విస్తృతంగా అమలు చేయాలని చెప్పారు.
ప్రజలకు తాగునీటి సరఫరాకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని, పశువులకు మేత కొరత తలెత్తకుండా ముందస్తు ఏర్పాట్లు చేయాలని, సీజనల్ వ్యాధుల నివారణకు అవసరమైన చర్యలు చేపట్టాలని మంత్రి అధికారులను ఆదేశించారు.
రాష్ట్ర ప్రభుత్వం ఎల్‌నినో పరిస్థితులను అత్యంత ప్రాధాన్యంతో పరిగణిస్తోందని, జిల్లాల వారీగా పరిస్థితులను నిరంతరం సమీక్షిస్తూ అవసరమైన చర్యలు చేపడుతుందని తెలిపారు. సిద్ధిపేట, చెన్నూరులో జరిగిన సమీక్ష సమావేశాల్లో వచ్చిన సూచనలతో పాటు సంగారెడ్డి సమావేశంలో ప్రజాప్రతినిధులు, అధికారులు చేసిన సూచనలను కూడా ప్రభుత్వానికి నివేదించి సమగ్ర కార్యాచరణ రూపొందిస్తామని చెప్పారు.
ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, ఉమ్మడి మెదక్ జిల్లా ప్రత్యేక అధికారి ఎ. వాణి ప్రసాద్ మాట్లాడుతూ ఎల్‌నినో పరిస్థితులను ముందుగానే అంచనా వేసి ప్రభుత్వం ప్రతి శాఖను సమాయత్తం చేస్తోందన్నారు. అందుబాటులో ఉన్న అన్ని వనరులను సమర్థంగా వినియోగిస్తూ ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా చూడడమే ఈ కంటింజెన్సీ ప్రణాళిక ప్రధాన లక్ష్యమని వివరించారు.
అనంతరం మంత్రి “జలసిరి” ప్రచార పోస్టర్లతో పాటు జిల్లా కంటింజెన్సీ ప్లాన్‌ను ఆవిష్కరించారు. సమావేశంలో వివిధ శాఖల అధికారులు పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వర్షపాత పరిస్థితులు, పంటల సాగు, భూగర్భ జలాల స్థితి, జలవనరుల్లో నీటి లభ్యత, విద్యుత్, తాగునీటి సరఫరా, ప్రత్యామ్నాయ కార్యాచరణ ప్రణాళిక తదితర అంశాలను వివరించారు.
ఈ సమావేశంలో జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్‌రావు, నారాయణఖేడ్ ఎమ్మెల్యే సంజీవ్‌రెడ్డి, నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి, సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, ఎమ్మెల్సీ అంజిరెడ్డి, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎ. వాణి ప్రసాద్, మెదక్ కలెక్టర్ ప్రతిమా సింగ్, సంగారెడ్డి కలెక్టర్ ప్రతీక్ జైన్, అదనపు కలెక్టర్లు, అదనపు ఎస్పీ చైతన్య రెడ్డి, సెట్విన్ కార్పొరేషన్ చైర్మన్ గిరిధర్ రెడ్డి, వివిధ మున్సిపాలిటీల ఛైర్మన్లు, ప్రజాప్రతినిధులు, మెదక్, సంగారెడ్డి జిల్లాల వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
