రాహుల్ గాంధీ అరెస్టు ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధం: మంత్రి వివేక్ వెంకటస్వామి
హైదరాబాద్, జూలై 21 : విద్యార్థుల ఆందోళనకు మద్దతుగా నిలిచిన లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీని అరెస్టు చేయడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని శక్తి (కార్మిక , ఉపాధి, శిక్షణ & ఫ్యాక్టరీస్) మరియు గనుల శాఖ మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి అన్నారు . ప్రజాస్వామ్యంలో శాంతియుతంగా నిరసన వ్యక్తం చేయడం ప్రతి పౌరుడికి రాజ్యాంగం కల్పించిన హక్కు అని అన్నారు.
తమ సమస్యల పరిష్కారం కోసం విద్యార్థులు గళమెత్తితే వారి గొంతు నొక్కడం సరికాదన్నారు . విద్యార్థుల అభిప్రాయాలను విని, సమస్యలను పరిష్కరించే దిశగా ప్రభుత్వాలు పనిచేయాలని సూచించారు. విద్యార్థుల ఆందోళనకు సంఘీభావం తెలిపిన రాహుల్ గాంధీతో పాటు కాంగ్రెస్ నాయకులను అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు.
భావప్రకటన స్వేచ్ఛ, శాంతియుత నిరసన హక్కులను పరిరక్షించడం ప్రజాస్వామ్య ప్రభుత్వాల బాధ్యత అని మంత్రి వివేక్ పేర్కొన్నారు. విద్యార్థుల హక్కులు, ప్రజాస్వామ్య విలువల పరిరక్షణ కోసం కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ అండగా నిలుస్తుందని ఆయన స్పష్టం చేశారు.
