ఏదులాబాద్ లో ఆగస్టు 13 నుంచి శ్రీ గోదా సమేత మన్నారూ రంగనాయక స్వామి బ్రహ్మోత్సవాలు
ఘట్‌కేసర్, ఆగస్టు 4 (వార్త): మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా ఘట్‌కేసర్ సర్కిల్ లోని ఏదులాబాద్ లోప్రసిద్ధ శ్రీ గోదా సమేత మన్నారూ రంగనాయక స్వామి దేవాలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఆగస్టు 13 నుంచి 19 వరకు వైభవంగా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ప్రతిరోజూ ప్రత్యేక పూజలు, వాహన సేవలు, కల్యాణోత్సవం, రథోత్సవం వంటి విశిష్ట కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు.
బ్రహ్మోత్సవాలకు ఆగస్టు 13న ఉదయం ధ్వజారోహణంతో శ్రీకారం చుట్టనున్నారు. అదే రోజు దేవతాహ్వానం కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఆగస్టు 14న శేషవాహన సేవ, హనుమంత వాహన సేవలతో పాటు శ్రీ ఆండాళ్ తిరునక్షత్ర మహోత్సవం జరుగుతుంది. ఆగస్టు 15న అశ్వవాహన సేవ, గజవాహన సేవలు నిర్వహిస్తారు.
ఆగస్టు 16న ఉదయం 11 గంటలకు శ్రీ గోదా సమేత రంగనాయక స్వామివారి కల్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించనుండగా, సాయంత్రం గరుడ సేవ జరుగుతుంది. ఆగస్టు 17న సాయంత్రం దివ్య విమాన రథోత్సవం నిర్వహించనున్నారు.
ఆగస్టు 18న మహాపూర్ణాహుతి, పుష్పయాగం, చక్రతీర్థం, గాంధోళి ఉత్సవం, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనుండగా, ఆగస్టు 19న స్వామివారి తిరుమంజనం, ఘటాభిషేకంతో బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి.
బ్రహ్మోత్సవాల్లో పాల్గొని స్వామివారి దివ్య ఆశీస్సులు పొందాలని ఆలయ నిర్వాహకులు భక్తులకు విజ్ఞప్తి చేశారు. సేవలు, విరాళాల వివరాల కోసం శ్రీ టి.పి. ఫణి స్వామి (98498 50010), శ్రీ టి.పి. పవన్ స్వామి (80089 97035)లను సంప్రదించవచ్చని తెలిపారు.
