చిన్నారుల్లో పెరుగుతున్న ఊబకాయం.. తెలంగాణలో ఆందోళనకరం!
హైదరాబాద్‌లో అధిక బరువు సమస్యపై ఆందోళన
చిన్న వయసులోనే బీపీ, మధుమేహం, కొవ్వు కాలేయం
సెల్‌ఫోన్–టీవీ వినియోగం, జంక్‌ఫుడ్‌తో మరింత ముప్పు
శారీరక శ్రమ, మానసిక ఆరోగ్యంపై దృష్టి పెట్టాలంటున్న వైద్యులు
హైదరాబాద్, సెప్టెంబరు 11, 2026: ఒకప్పుడు చిన్నారుల్లో పోషకాహార లోపం, తక్కువ బరువు ప్రధాన సమస్యలుగా ఉండేవి. ప్రస్తుతం పరిస్థితి మారుతోంది. అధిక బరువు, ఊబకాయం కూడా చిన్నారులను వేధిస్తున్నాయి. తెలంగాణలో చిన్నారుల ఊబకాయం గణనీయంగా పెరుగుతోందని కిమ్స్ కడల్స్, సికింద్రాబాద్ క్లినికల్ డైరెక్టర్, చీఫ్ నియోనాటాలజిస్ట్ డాక్టర్ బాబు ఎస్. మదార్కర్ తెలిపారు.
జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే (NFHS)-4లో తెలంగాణలో చిన్నారుల ఊబకాయం 0.7 శాతంగా ఉండగా, NFHS-5 నాటికి 3.4 శాతానికి పెరిగిందని ఆయన తెలిపారు. హైదరాబాద్ వంటి పట్టణ ప్రాంతాల్లో పాఠశాలలకు వెళ్లే పిల్లల్లో అధిక బరువు, ఊబకాయం కలిపి 20 నుంచి 35 శాతం వరకు ఉన్నట్లు వివిధ అధ్యయనాలు వెల్లడిస్తున్నాయని చెప్పారు.
దేశవ్యాప్తంగా ‘డబుల్ బర్డెన్’ పోషక సమస్య
భారత్‌లో ఒకవైపు పిల్లల్లో అధిక బరువు, ఊబకాయం పెరుగుతుండగా.. మరోవైపు అనేక ప్రాంతాల్లో పోషకాహార లోపం, ఎదుగుదల లోపం వంటి సమస్యలు కొనసాగుతున్నాయని డాక్టర్ మదార్కర్ తెలిపారు. ఈ రెండు రకాల పోషక సమస్యలు ఒకేసారి కొనసాగడాన్ని ‘డబుల్ బర్డెన్ ఆఫ్ మాల్న్యూట్రిషన్’గా పేర్కొంటారని వివరించారు.
ఇళ్లలో సంప్రదాయ ఆహారానికి బదులుగా అధిక చక్కెర, ఉప్పు, కొవ్వు కలిగిన ప్యాకేజ్డ్ ఆహార పదార్థాలు, శుద్ధి చేసిన పిండి పదార్థాలు, చిప్స్, నూడుల్స్, బిస్కెట్లు, తీపి పానీయాల వినియోగం పెరుగుతోందన్నారు. ఇవి పిల్లల ఆహారపు అలవాట్లపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయని చెప్పారు.
తెలంగాణలో వేగంగా పెరుగుతున్న సమస్య
2015–16లో జరిగిన NFHS-4తో పోలిస్తే 2019–21లో జరిగిన NFHS-5లో తెలంగాణలో చిన్నారుల ఊబకాయం 0.7 శాతం నుంచి 3.4 శాతానికి పెరిగిందని డాక్టర్ మదార్కర్ తెలిపారు. అంటే 2.7 శాతం పాయింట్ల పెరుగుదల నమోదైందన్నారు.
రాష్ట్రంలో పెద్దల్లోనూ అధిక బరువు, ఊబకాయం ఆందోళన కలిగించే స్థాయిలో ఉన్నాయని చెప్పారు. తల్లిదండ్రుల జీవనశైలి, ఆహారపు అలవాట్లు పిల్లలపై కూడా ప్రభావం చూపుతున్నాయని తెలిపారు. కొన్ని ప్రాంతాల్లో రక్తహీనత వంటి సూక్ష్మ పోషక లోపాలు కొనసాగుతుండగానే.. కౌమారదశ పిల్లల్లో బాడీ మాస్ ఇండెక్స్ (BMI) పెరుగుతుండటం ఆందోళనకరమన్నారు.
“బరువు ఎక్కువగా ఉన్నంత మాత్రాన పిల్లలకు పోషకాహారం సరిగ్గా అందుతున్నట్లు కాదు” అనే విషయాన్ని తల్లిదండ్రులు గుర్తించాలని సూచించారు.
హైదరాబాద్‌లో పట్టణ జీవనశైలితో ముప్పు
వేగవంతమైన పట్టణీకరణ, మారుతున్న జీవనశైలి, ఇంటి వద్దే ఎక్కువ సమయం గడపడం, ఆన్లైన్ ఫుడ్ డెలివరీ, జంక్‌ఫుడ్ సులభంగా అందుబాటులో ఉండటం వంటి కారణాలతో హైదరాబాద్‌లో చిన్నారుల్లో అధిక బరువు సమస్య పెరుగుతోందని డాక్టర్ మదార్కర్ తెలిపారు.
గచ్చిబౌలి, మియాపూర్, మాదాపూర్ వంటి అభివృద్ధి చెందుతున్న ప్రాంతాల్లోనూ పిల్లల్లో శారీరక చురుకుదనం తగ్గుతోందన్నారు. చదువుల ఒత్తిడి, ఇంట్లోనే ఎక్కువ సమయం గడపడం, ఆట స్థలాల కొరత, స్క్రీన్ వినియోగం పెరగడం ఇందుకు ప్రధాన కారణాలని చెప్పారు.
హైదరాబాద్‌లోని కొన్ని పట్టణ, క్లినికల్ పరిస్థితులను పరిశీలిస్తే ప్రతి ఇద్దరు లేదా ముగ్గురు పిల్లల్లో ఒకరు అధిక బరువు లేదా ఊబకాయంతో ఉన్నట్లు కనిపిస్తోందని పేర్కొన్నారు. ఇది కేవలం సంపన్న కుటుంబాల పిల్లల సమస్య కాదని, వివిధ సామాజిక వర్గాల్లోనూ కనిపిస్తున్న ప్రజారోగ్య సమస్యగా మారుతోందన్నారు.
చిన్న వయసులోనే పెద్దల జబ్బులు
అధిక బరువు కారణంగా పిల్లల్లో చిన్న వయసులోనే అధిక రక్తపోటు, కొవ్వు కాలేయం, టైప్-2 మధుమేహం వంటి జీవనశైలి సంబంధిత వ్యాధులు కనిపిస్తున్నాయని డాక్టర్ మదార్కర్ తెలిపారు.
దీర్ఘకాలం సెల్‌ఫోన్, టీవీ, ఇతర స్క్రీన్ల ముందు కూర్చోవడం వల్ల శారీరక శ్రమ తగ్గిపోతోందన్నారు. అదే సమయంలో స్క్రీన్ చూస్తూ చిప్స్, నూడుల్స్, బిస్కెట్లు, తీపి పానీయాలు వంటి ఆహార పదార్థాలను తరచూ తీసుకోవడం అలవాటవుతోందని చెప్పారు. దీంతో అధిక కేలరీలు శరీరంలోకి చేరడంతో పాటు పిల్లల సహజ ఆకలి నియంత్రణ కూడా దెబ్బతింటుందని వివరించారు.
బరువు తగ్గించడమే పరిష్కారం కాదు
చిన్నారుల ఊబకాయాన్ని కేవలం ఆహారం తగ్గించడం ద్వారా నియంత్రించలేమని డాక్టర్ మదార్కర్ స్పష్టం చేశారు. పిల్లల మానసిక ఆరోగ్యం, స్క్రీన్ వినియోగం, శారీరక చురుకుదనం, కుటుంబ సభ్యుల జీవనశైలి వంటి అంశాలన్నింటిపైనా దృష్టి పెట్టాలని సూచించారు.
తల్లిదండ్రులు పిల్లలకు ఆరోగ్యకరమైన జీవనశైలి గురించి చెప్పడమే కాకుండా.. తామూ దానిని పాటించాలని అన్నారు. రోజువారీ శారీరక శ్రమకు సమయం కేటాయించాలని, పాఠశాలల్లో క్రమబద్ధమైన వ్యాయామం, క్రీడలకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు.
ప్యాకెట్ ఆహారాలపై నియంత్రణ అవసరం
చిన్నారులకు అధిక చక్కెర, ఉప్పు, కొవ్వు కలిగిన ఆహార పదార్థాలు సులభంగా అందుబాటులో ఉండటం కూడా ఊబకాయం సమస్యను పెంచుతోందని తెలిపారు.
ICMR-NIN నేతృత్వంలోని ‘లెట్స్ ఫిక్స్ అవర్ ఫుడ్’ (LFOF) కార్యక్రమం యువత ఆహార వాతావరణంలో మార్పులు తీసుకురావడానికి పలు సూచనలు చేసిందన్నారు. ఆహార ప్యాకెట్లపై అధిక చక్కెర, ఉప్పు, కొవ్వు వంటి అంశాలను స్పష్టంగా తెలియజేసే ఫ్రంట్-ఆఫ్-ప్యాక్ న్యూట్రిషన్ లేబులింగ్ (FoPNL)ను అమలు చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు.
పాఠశాలల్లో జంక్‌ఫుడ్‌కు కళ్లెం
పాఠశాల ప్రాంగణాల్లో, వాటి 50 మీటర్ల పరిధిలో అధిక కొవ్వు, చక్కెర, ఉప్పు కలిగిన (HFSS) ఆహార పదార్థాల విక్రయం, ప్రకటనలపై ఉన్న నిబంధనలను కఠినంగా అమలు చేయాల్సిన అవసరం ఉందన్నారు.
పాఠశాలలు ‘ఈట్ రైట్ స్కూల్’ విధానాన్ని అమలు చేయాలని, క్యాంటీన్లలో పోషక విలువలున్న ఆహారాన్ని అందుబాటులో ఉంచాలని సూచించారు. క్యాంటీన్లకు అవసరమైన లైసెన్సులు, ఆహార పట్టికలపై ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహించడంతో పాటు పోషకాహార నిపుణుల సూచనలు తీసుకోవాలని అన్నారు.
రోజుకు గంట శారీరక శ్రమ తప్పనిసరి
చిన్నారులు రోజులో కనీసం 45 నుంచి 60 నిమిషాలు శారీరకంగా చురుకుగా ఉండేలా పాఠశాలలు చర్యలు తీసుకోవాలని డాక్టర్ మదార్కర్ సూచించారు. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లోనూ రోజువారీ వ్యాయామం, క్రీడలకు తగిన సమయం కేటాయించాలని అన్నారు.
నగరాల్లో పిల్లలు ఆడుకునేందుకు సురక్షితమైన ఆటస్థలాలు, నడక మార్గాలు, సైకిల్ ట్రాక్‌లను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందన్నారు. వేగంగా అభివృద్ధి చెందుతున్న నివాస ప్రాంతాల్లో ఉన్న బహిరంగ స్థలాలను కాపాడాలని సూచించారు.
చిన్నారుల ఊబకాయాన్ని కేవలం వ్యక్తిగత సమస్యగా కాకుండా కుటుంబం, పాఠశాల, సమాజం కలిసి పరిష్కరించాల్సిన ప్రజారోగ్య సమస్యగా చూడాల్సిన అవసరం ఉందని డాక్టర్ బాబు ఎస్. మదార్కర్ స్పష్టం చేశారు.
