కార్మికులకు కనీస వేతనాల పెంపు.. 1.10 కోట్ల మందికి ప్రయోజనం
గత పదేళ్లలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం కనీస వేతనాలను సవరించలేదు
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే 73 కేటగిరీలుగా విభజించి కొత్త వేతనాల అమలు
మున్సిపల్ కార్పొరేషన్లకు జోన్-1, మున్సిపాలిటీలకు జోన్-2, గ్రామీణ ప్రాంతాలకు జోన్-3
కాంట్రాక్ట్ కార్మికులకూ సవరించిన కనీస వేతనాలు వర్తింపు
శక్తి, గనుల శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి
హైదరాబాద్, సెప్టెంబర్ 9: రాష్ట్రంలోని కార్మికుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్ ప్రభుత్వం కనీస వేతనాలను గణనీయంగా పెంచిందని శక్తి, గనుల శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి తెలిపారు. తెలంగాణ శాసన మండలిలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిస్తూ.. సవరించిన కనీస వేతనాల వల్ల రాష్ట్రవ్యాప్తంగా సుమారు 1.10 కోట్ల మంది కార్మికులకు ప్రయోజనం కలుగుతుందని వెల్లడించారు.
కార్మికులను అన్‌స్కిల్డ్, సెమీ స్కిల్డ్, స్కిల్డ్, హైలీ స్కిల్డ్గా నాలుగు కేటగిరీలుగా వర్గీకరించినట్లు మంత్రి తెలిపారు. కనీస వేతనాల నిర్ణయం కోసం రాష్ట్రాన్ని మూడు జోన్లుగా విభజించామని చెప్పారు. మున్సిపల్ కార్పొరేషన్లను జోన్-1, మున్సిపాలిటీలను జోన్-2, గ్రామీణ మరియు ఇతర ప్రాంతాలను జోన్-3గా నిర్ణయించినట్లు వివరించారు.
పదేళ్లుగా వేతనాల సవరణకు దూరం
గత పదేళ్ల బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో కనీస వేతనాల సవరణకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని మంత్రి విమర్శించారు. నిబంధనల ప్రకారం కనీస వేతనాలను నిర్ణీత కాల వ్యవధిలో సవరించాల్సి ఉన్నప్పటికీ గత ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకోలేదన్నారు. కేవలం డీఏకు సంబంధించిన వివిధ వేరియబుల్స్‌లో మార్పులు చేయడం తప్ప కార్మికుల కనీస వేతనాల పెంపుపై దృష్టి పెట్టలేదని తెలిపారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం కనీస వేతనాల సవరణ ప్రక్రియను చేపట్టిందని వివేక్ వెంకటస్వామి చెప్పారు. నోటిఫికేషన్లు జారీ చేసి, కనీస వేతనాల బోర్డును ఏర్పాటు చేసి, దాని సిఫారసులను తీసుకున్నామని తెలిపారు. అనంతరం 2025 జూన్ 27న క్యాబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.
పరిశ్రమలు, కార్మికులతో చర్చలు
కనీస వేతనాల పెంపుపై పరిశ్రమల ప్రతినిధులు, సీఐఐతో పాటు ఇతర ఇండస్ట్రీ ఆర్గనైజేషన్లతో చర్చలు జరిపామని మంత్రి తెలిపారు. అదే విధంగా కార్మికులతోనూ సంప్రదింపులు నిర్వహించి, అందరి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాత కనీస వేతనాలను సవరించినట్లు చెప్పారు.
కోర్ ఏరియాలో రూ.10,900గా ఉన్న కనీస వేతనాన్ని రూ.14,000కు, జోన్-2లో రూ.15,000కు, జోన్-1లో రూ.16,000కు పెంచినట్లు మంత్రి తెలిపారు. మొత్తం 73 కేటగిరీలుగా విభజించి, సంబంధిత కేటగిరీలకు కొత్త కనీస వేతనాలను వర్తింపజేస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసినట్లు వివరించారు.
కాంట్రాక్ట్ కార్మికులకూ కొత్త వేతనాలు
సవరించిన కనీస వేతనాలు రాష్ట్రవ్యాప్తంగా సుమారు 1.10 కోట్ల మంది కార్మికులకు వర్తిస్తాయని మంత్రి తెలిపారు. స్కిల్డ్ కార్మికులకు రాష్ట్రవ్యాప్తంగా ఒకే విధమైన వేతనాలు అమలవుతాయని చెప్పారు. అన్‌స్కిల్డ్, సెమీ స్కిల్డ్ కార్మికులకు సంబంధించిన వివరాలు లేబర్ డిపార్ట్‌మెంట్ జారీ చేసిన జీఓ నంబర్ 6లో పొందుపరిచినట్లు తెలిపారు.
కాంట్రాక్ట్ కార్మికులకు కూడా ప్రత్యేక ప్రభుత్వ ఉత్తర్వుల ద్వారా సవరించిన కనీస వేతనాలు వర్తిస్తాయని స్పష్టం చేశారు.
ఒకసారి నిర్ణయించిన కనీస వేతనం కార్మికుడి హక్కుగా మారుతుందని మంత్రి పేర్కొన్నారు. ప్రస్తుతం తక్కువ వేతనాలు చెల్లిస్తున్న సంస్థలు, యాజమాన్యాలు సవరించిన కనీస వేతనాలను తప్పనిసరిగా అమలు చేయాలని ఆదేశించారు. ఇప్పటికే పెంచిన వేతనాలను తిరిగి తగ్గించడం కార్మిక వ్యతిరేక చర్యగా పరిగణిస్తామని హెచ్చరించారు.
ఉల్లంఘనలపై కఠిన చర్యలు
కొన్ని మున్సిపాలిటీలు, సంస్థల్లో సవరించిన కనీస వేతనాలు అమలు కావడం లేదన్న సభ్యుల ప్రశ్నలకు మంత్రి స్పందించారు. అలాంటి సంస్థల వివరాలను ప్రభుత్వం దృష్టికి తీసుకువస్తే కార్మిక శాఖ ద్వారా తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
ఇక్రిసాట్‌లో కనీస వేతనాల అమలుకు సంబంధించి కార్మిక శాఖ జాయింట్ కమిషనర్ ఆధ్వర్యంలో సంబంధిత అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి సమస్యను పరిష్కరిస్తామని తెలిపారు. డీమార్ట్‌లోనూ కనీస వేతనాలు అమలు కావడం లేదన్న ఫిర్యాదులపై నోటీసులు జారీ చేసి, సవరించిన వేతనాలు తప్పనిసరిగా అమలయ్యేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
కనీస వేతనాల అమలులో ఎక్కడైనా ఉల్లంఘనలు కనిపిస్తే తమ శాఖ దృష్టికి తీసుకురావాలని శాసన మండలి సభ్యులను మంత్రి కోరారు. రాష్ట్రంలోని ప్రతి కార్మికుడికి న్యాయం జరిగేలా ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటుందని మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి స్పష్టం చేశారు.
