అక్టోబర్ 31లోగా సమ్మిట్ పనులు పూర్తి
శక్తి, గనుల శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి
హైదరాబాద్, సెప్టెంబర్ 22: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆలోచన మేరకు తెలంగాణ రైజింగ్–ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ 2026ను ఫ్యూచర్ సిటీలోని స్కిల్ యూనివర్సిటీ ప్రాంగణంలో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు శక్తి, గనుల శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి తెలిపారు. సమ్మిట్ నిర్వహణకు సంబంధించి యూనివర్సిటీలో కొనసాగుతున్న పనులపై అధికారులు, కాంట్రాక్టర్లతో మంగళవారం మంత్రి సమీక్ష నిర్వహించారు.
అవసరమైన మెటీరియల్, మ్యాన్‌పవర్ నియామకం, పనుల పురోగతి తదితర అంశాలను సమగ్రంగా సమీక్షించి పనుల షెడ్యూల్‌ను ఖరారు చేసినట్లు మంత్రి తెలిపారు. సమ్మిట్‌కు అవసరమైన అన్ని మౌలిక వసతులతో పాటు రోడ్లు, డ్రైనేజీ తదితర పనులను అక్టోబర్ 31లోగా పూర్తి చేసి సమ్మిట్ బృందానికి అప్పగిస్తామని చెప్పారు. ఈవెంట్ మేనేజ్‌మెంట్ బృందానికి సమ్మిట్‌కు ముందు అవసరమైన సమయం అందుబాటులో ఉండేలా పనులను ముందుగానే పూర్తి చేస్తున్నట్లు వివరించారు.
సమ్మిట్ కోసం ఆరు సెమినార్ హాళ్లను సిద్ధం చేస్తున్నామని మంత్రి తెలిపారు. వీటితో పాటు మూడు పెద్ద హాళ్లు, మరో 10 చిన్న హాళ్లను కూడా ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. సమ్మిట్‌లో నిర్వహించే వివిధ సమావేశాలు, సెమినార్లు, ఇతర కార్యక్రమాలకు అనుగుణంగా వీటిని వినియోగించనున్నట్లు వెల్లడించారు.
గ్లోబల్ సమ్మిట్ కోసం చేపడుతున్న ఏర్పాట్లు, నిర్మిస్తున్న మౌలిక వసతులు సమ్మిట్ అనంతరం కూడా ఉపయోగపడేలా ప్రణాళిక రూపొందిస్తున్నట్లు మంత్రి తెలిపారు. సమ్మిట్ పూర్తయిన తర్వాత ఈ భవనాలు, మౌలిక వసతులను స్కిల్ యూనివర్సిటీకి అప్పగిస్తామని చెప్పారు.
54 ఎకరాల్లో అంతర్జాతీయ ప్రమాణాలతో స్కిల్ యూనివర్సిటీని అభివృద్ధి చేస్తున్నట్లు మంత్రి వివేక్ వెంకటస్వామి తెలిపారు. యూనివర్సిటీ భవిష్యత్ అవసరాలకు ఉపయోగపడేలా సమ్మిట్ కోసం చేపడుతున్న పనులను ప్రణాళికాబద్ధంగా పూర్తి చేస్తున్నామని చెప్పారు.
యూనివర్సిటీలో బాయ్స్ హాస్టల్, గర్ల్స్ హాస్టల్, డైనింగ్ హాల్ తదితర మౌలిక వసతుల నిర్మాణ పనులు కూడా కొనసాగుతున్నాయని మంత్రి తెలిపారు. పనులను వేగంగా పూర్తి చేసి వచ్చే ఫిబ్రవరి నాటికి స్కిల్ యూనివర్సిటీలో కార్యకలాపాలు ప్రారంభించేలా చర్యలు తీసుకుంటున్నట్లు వివేక్ వెంకటస్వామి వెల్లడించారు.
