ప్రశ్నించిన బీఆర్ఎస్ నేతలపై దాడి.. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న కాంగ్రెస్
రాహుల్, రేవంత్ అశోక్‌నగర్‌కు వచ్చి నిరుద్యోగులకు సమాధానం చెప్పాలి: కోగిల మహేష్
ములుగు, నవంబర్ 27: నిరుద్యోగులకు ఇచ్చిన హామీలపై ప్రశ్నించిన బీఆర్ఎస్ నేతలపై దాడికి యత్నించడం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనని బీఆర్ఎస్ జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు కోగిల మహేష్ మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాస్వామ్య విలువలను కాలరాస్తోందని విమర్శించారు. ఈ మేరకు శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో ఆయన కాంగ్రెస్ నేతల తీరును ఖండించారు.
ఏడాదికి రెండు లక్షల ఉద్యోగాలు, జాబ్ క్యాలెండర్, నిరుద్యోగ భృతి అందిస్తామని రాహుల్ గాంధీ, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అశోక్‌నగర్‌లోని బావర్చి హోటల్లో నిరుద్యోగులకు హామీ ఇచ్చారని గుర్తుచేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి మూడేళ్లు గడుస్తున్నా ఆ హామీలను అమలు చేయలేదని విమర్శించారు.
ఇదే అంశంపై ప్రశ్నించేందుకు బావర్చి హోటల్ వద్దకు వెళ్లిన మన్నె క్రిశాంక్ తదితరులపై రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్ అనుచరులు దాడికి యత్నించారని ఆరోపించారు. ఉదయం ప్రజాస్వామ్య పరిరక్షణ ర్యాలీ నిర్వహించి, రాత్రి ప్రశ్నించిన వారిపై దాడికి దిగడం కాంగ్రెస్ పార్టీకి రాజ్యాంగం, ప్రజాస్వామ్యంపై ఉన్న గౌరవాన్ని తెలియజేస్తోందని ఎద్దేవా చేశారు.
దమ్ముంటే రాహుల్ గాంధీ, రేవంత్‌రెడ్డి అశోక్‌నగర్‌కు వచ్చి నిరుద్యోగుల ప్రశ్నలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. హామీలు అమలు చేయనందుకు నిరుద్యోగులకు క్షమాపణ చెప్పాలని కోరారు. దాడికి యత్నించిన వారిపై వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకోకపోతే ఆందోళన కార్యక్రమాలు చేపడతామని కోగిల మహేష్ హెచ్చరించారు.
