ఇళ్లు కోల్పోతున్న ప్రతి కుటుంబానికి న్యాయం చేయాలి
తాడిచర్ల ఓసీపీ నిర్వాసితుల జాబితాలను పునఃపరిశీలించాలి
స్థానిక, స్థానికేతరులను గుర్తించేందుకు ముగ్గురు అధికారులతో ఉమ్మడి విచారణ చేపట్టాలి
కలెక్టర్కు వినతిపత్రం అందజేసిన సర్పంచ్ బండి స్వామి, భూ నిర్వాసితుల కమిటీ అధ్యక్షుడు దండు రమేష్
భూపాలపల్లి, నవంబర్ 27 : తాడిచర్ల టీఎస్ జెన్కో ఉపరితల బొగ్గు గని ఓసీపీ బ్లాక్-1 పరిధిలోని 500 మీటర్ల డేంజర్ జోన్లో ఇళ్లు కోల్పోతున్న ప్రతి కుటుంబానికి న్యాయం చేయాలని తాడిచర్ల గ్రామ సర్పంచ్ బండి స్వామి, భూ నిర్వాసితుల కమిటీ అధ్యక్షుడు, ఈజీసీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు దండు రమేష్ కోరారు. నిర్వాసితుల జాబితాల్లోని తప్పులను సరిచేసి నిజమైన అర్హులకు పునరావాస ప్యాకేజీ అందించాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు శుక్రవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, అదనపు కలెక్టర్ అశోక్ కుమార్కు వినతిపత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అధికారులు ప్రకటించిన విత్ పర్మిషన్ జాబితాలో 1,203 గృహాలు, విత్ ఔట్ పర్మిషన్ జాబితాలో 1,062 గృహాలు ఉన్నాయని తెలిపారు. ఈ రెండు జాబితాలను మరోసారి క్షేత్రస్థాయిలో సమగ్రంగా పరిశీలించి అర్హులైన నిర్వాసితులను గుర్తించాలని కోరారు.
స్థానిక, స్థానికేతరులను గుర్తించాలి
విత్ పర్మిషన్ జాబితాలో ఉన్న స్థానికేతరులను గుర్తించాలని, విత్ ఔట్ పర్మిషన్ జాబితాలో ఉన్న స్థానికులకు అర్హత మేరకు విత్ పర్మిషన్ జాబితాలో చోటు కల్పించాలని కోరారు. స్థానికేతరులను నిబంధనల ప్రకారం ప్రత్యేకంగా పరిగణించాలని సూచించారు. ఇందుకోసం ఎంపీడీవో, తహసీల్దార్, మండల వ్యవసాయ శాఖ అధికారులతో ఉమ్మడి విచారణ నిర్వహించి నిజమైన లబ్ధిదారులను గుర్తించాలని కలెక్టర్కు విజ్ఞప్తి చేశారు.
అర్హులందరికీ పునరావాస ప్యాకేజీ ఇవ్వాలి
పునరావాస ప్యాకేజీలో పేర్లు నమోదు కాని బాధిత కుటుంబాల దరఖాస్తులను మరోసారి పరిశీలించి అర్హులందరికీ న్యాయం చేయాలని కోరారు. 2022 డిసెంబర్లో ప్రాథమిక నోటిఫికేషన్ ప్రకటించినప్పటికీ సామాజిక ఆర్థిక సర్వే (SES) 2026 జూలై 1న ఆలస్యంగా ప్రారంభమైందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ప్యాకేజీ అందించే సమయానికి 18 ఏళ్లు నిండిన వారిని కూడా అర్హులుగా గుర్తించాలని విజ్ఞప్తి చేశారు.
రెండు గుంటల స్థలం లేదా అదనపు పరిహారం ఇవ్వాలి
పునరావాస ప్యాకేజీలో భాగంగా రెండు గుంటల ఇంటి స్థలం కోరిన బాధితులకు స్థలం కేటాయించాలని కోరారు. స్థలానికి బదులుగా నగదు పరిహారం తీసుకోవాలనుకునే వారికి గ్రామంలో ప్రస్తుతం అమల్లో ఉన్న స్థానిక మార్కెట్ ధర కంటే 50 శాతం అదనంగా చెల్లించాలని డిమాండ్ చేశారు.
గతంలో సర్వే చేయని ఇళ్లనూ పరిగణనలోకి తీసుకోవాలి
2012–13లో గుర్తించిన 1,329 ఇళ్లతో పాటు, వాటి వారసులు నిర్మించుకున్న ఇళ్లు, కుటుంబ అవసరాల కోసం అదనంగా నిర్మించిన నివాస గృహాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని కోరారు. అనుమతులు లేని కారణంతో ఆయా కుటుంబాలకు అన్యాయం జరగకుండా నిబంధనల ప్రకారం పరిశీలించి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.
వినతిపత్రం కార్యక్రమంలో పలువురు
ఈ కార్యక్రమంలో గ్రామ ఉపసర్పంచ్ బొబ్బిలి రాజు, భూ నిర్వాసితుల కమిటీ ఉపాధ్యక్షుడు బండి రాజయ్య, మాజీ సర్పంచ్ దన్నపనేని అశోక్ రావు, నిర్వాసితులు కేసారపు చంద్రయ్య, ఇందారపు చంద్రయ్య, తాండ్ర మల్లేష్, రామిడి గట్టయ్య, అర్ని సత్యనారాయణ, దన్నపనేని సురేష్ రావు, ఇందారపు శివకుమార్, ఎండీ అజ్మత్ అలీ, ధనంజయులు, సంతోష్ తదితరులు పాల్గొన్నారు.
