గిగ్ వర్కర్ కొండల్‌రెడ్డికి అండగా ప్రభుత్వం
సీఎంఆర్ఎఫ్ చెక్ అందించిన మంత్రి వివేక్ వెంకటస్వామి
హైదరాబాద్, సెప్టెంబర్ 22: గిగ్, ప్లాట్‌ఫామ్ వర్కర్ కొండల్‌రెడ్డి చికిత్సకు ప్రభుత్వం అండగా నిలిచింది. క్యాన్సర్‌తో బాధపడుతున్న కొండల్‌రెడ్డికి రూ.2,77,500 విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కును శక్తి, గనుల శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి మంగళవారం అందజేశారు.
గత తొమ్మిదేళ్లుగా ఉబర్ డ్రైవర్‌గా పనిచేస్తున్న కొండల్‌రెడ్డి అనారోగ్యం కారణంగా ప్రస్తుతం విధులు నిర్వహించలేని పరిస్థితిలో ఉన్నారు. దీంతో ఆయన కుటుంబం తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటోంది. కొండల్‌రెడ్డికి పాఠశాలకు వెళ్లే ఇద్దరు కుమార్తెలు ఉండగా, కుటుంబానికి ఆయనే ఏకైక ఆదాయ వనరుగా ఉన్నారు.
ఈ విషయాన్ని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లగా, ప్రభుత్వం తక్షణమే స్పందించి సీఎంఆర్ఎఫ్ ద్వారా ఆర్థిక సహాయం అందించిందని మంత్రి వివేక్ వెంకటస్వామి తెలిపారు.
కొండల్‌రెడ్డికి పంజాగుట్టలోని నిమ్స్ ఆసుపత్రిలో సంపూర్ణ చికిత్స అందేలా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చారని తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్‌ఫామ్ వర్కర్స్ యూనియన్ వ్యవస్థాపక అధ్యక్షుడు షేక్ సలావుద్దీన్ తెలిపారు. కొండల్‌రెడ్డి చికిత్సకు ప్రభుత్వం అండగా నిలవడం పట్ల ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
కష్టకాలంలో తమ కుటుంబానికి అండగా నిలిచిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రి వివేక్ వెంకటస్వామికి కొండల్‌రెడ్డి కుటుంబ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు.
