వరల్డ్‌స్కిల్స్ పోటీల్లో తెలంగాణ యువత సత్తా
లాజిస్టిక్స్ అండ్ ఫ్రైట్ ఫార్వార్డింగ్‌లో మెహ్రున్నిసాకు సిల్వర్ మెడల్
క్యాబినెట్ మేకింగ్‌లో కె. యశ్వంత్ చారికి Medal of Excellence
తెలంగాణ నుంచి ముగ్గురు పాల్గొంటే.. ఇద్దరికి అంతర్జాతీయ గుర్తింపు
యువత విజయంపై మంత్రి వివేక్ వెంకటస్వామి అభినందనలు
షాంఘై, సెప్టెంబర్ 27: చైనాలోని షాంఘైలో జరిగిన WorldSkills Competition 2026లో తెలంగాణ యువత అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటింది. తెలంగాణ నుంచి ముగ్గురు యువతీ యువకులు పోటీల్లో పాల్గొనగా, వారిలో ఇద్దరు ప్రతిభ కనబరిచి అంతర్జాతీయ గుర్తింపు సాధించారు. లాజిస్టిక్స్ అండ్ ఫ్రైట్ ఫార్వార్డింగ్ విభాగంలో మెహ్రున్నిసా సిల్వర్ మెడల్ సాధించగా, క్యాబినెట్ మేకింగ్ విభాగంలో కె. యశ్వంత్ చారి Medal of Excellence అందుకున్నారు.
తెలంగాణ యువత ప్రపంచస్థాయి నైపుణ్య పోటీల్లో అద్భుత ప్రతిభ కనబరచడం పట్ల శక్తి, గనుల శాఖ మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి హర్షం వ్యక్తం చేశారు. మెహ్రున్నిసా, కె. యశ్వంత్ చారిని మంత్రి అభినందించారు. ప్రపంచ వేదికపై తెలంగాణకు గుర్తింపు తీసుకురావడం రాష్ట్రానికి గర్వకారణమని పేర్కొన్నారు.
వరల్డ్‌స్కిల్స్ షాంఘై–2026లో భారత్ 10వ స్థానంలో నిలిచి ఆరు సిల్వర్ మెడల్స్, 20 Medal of Excellence అవార్డులు సాధించడం విశేషమని మంత్రి తెలిపారు. 2024లో ఫ్రాన్స్‌లో జరిగిన వరల్డ్‌స్కిల్స్ పోటీల్లో భారత్ 13వ స్థానంలో నిలవగా, ఈసారి 10వ స్థానానికి చేరుకోవడం దేశ యువత నైపుణ్య సామర్థ్యానికి నిదర్శనమన్నారు.
భారత్ తరఫున 70 మంది పోటీదారులు 63 నైపుణ్య విభాగాల్లో పాల్గొన్నారని మంత్రి తెలిపారు. ఆధునిక సాంకేతికత, అడ్వాన్స్‌డ్ మ్యాన్యుఫ్యాక్చరింగ్, ఇంజినీరింగ్, డిజిటల్, క్రియేటివ్, సర్వీస్ రంగాలకు చెందిన విభాగాల్లో భారత యువత అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా తమ ప్రతిభను ప్రదర్శించిందన్నారు.
తెలంగాణ నుంచి పాల్గొన్న ముగ్గురిలో ఇద్దరు అంతర్జాతీయ స్థాయిలో పతకం, గుర్తింపు సాధించడం ప్రత్యేకంగా అభినందించాల్సిన విషయమని మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. మెహ్రున్నిసా సాధించిన సిల్వర్ మెడల్, కె. యశ్వంత్ చారి సాధించిన Medal of Excellence తెలంగాణ యువతలో ఉన్న నైపుణ్య ప్రతిభకు నిదర్శనమని పేర్కొన్నారు.
గత వరల్డ్‌స్కిల్స్ పోటీల్లో తెలంగాణకు కాంస్య పతకం లభించగా, ఈసారి సిల్వర్ మెడల్‌తో పాటు Medal of Excellence సాధించడం రాష్ట్రానికి గర్వకారణమని మంత్రి అన్నారు.
తెలంగాణ యువతలో అపారమైన ప్రతిభ, నైపుణ్యం ఉందని మంత్రి తెలిపారు. వారికి అత్యుత్తమ శిక్షణ, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, పరిశ్రమలతో అనుసంధానం, అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణమైన అవకాశాలు కల్పిస్తే ప్రపంచస్థాయి పోటీల్లో మరిన్ని విజయాలు సాధించగలరని అన్నారు.
నైపుణ్యాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యతతో పాటు, యువతను భవిష్యత్ ఉపాధి అవకాశాలకు, అంతర్జాతీయ పోటీకి సిద్ధం చేసేందుకు చేపడుతున్న కార్యక్రమాలకు ఈ విజయాలు మరింత ఉత్సాహాన్ని ఇస్తాయని మంత్రి వివేక్ వెంకటస్వామి పేర్కొన్నారు.
