నవంబర్ 19న సిద్దిపేటలో సీఎం రేవంత్ రెడ్డి భారీ బహిరంగ సభ
ఇందిరమ్మ కుటుంబ బీమా, ఇందిరమ్మ చీరల పంపిణీకి శ్రీకారం
సభా ఏర్పాట్లను పరిశీలించిన మంత్రులు వివేక్ వెంకటస్వామి, పొన్నం ప్రభాకర్
ఆరు గ్యారెంటీలు, సంక్షేమ పథకాల అమలుపై ప్రజలకు వివరించనున్న సీఎం
సిద్దిపేట, నవంబర్ 10: మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతిని పురస్కరించుకుని ఈ నెల 19న సిద్దిపేటలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈ సభ వేదికగా రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయనున్న ఇందిరమ్మ కుటుంబ బీమా పథకాన్ని సీఎం లాంఛనంగా ప్రారంభించడంతో పాటు మహిళలకు ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు. ఈ మేరకు మంత్రులు డాక్టర్ గడ్డం వివేక్ వెంకటస్వామి, పొన్నం ప్రభాకర్ వెల్లడించారు.
సభ నిర్వహణకు సంబంధించి సిద్దిపేటలోని సభా స్థలాన్ని, ఏర్పాట్లను మంత్రులు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. భారీ సంఖ్యలో ప్రజలు హాజరయ్యే అవకాశం ఉండటంతో పార్కింగ్ సదుపాయాలు, ప్రజలకు అవసరమైన మౌలిక వసతులు, రాకపోకల మార్గాలు, సభ నిర్వహణకు అనువైన ప్రాంతాలను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.
ఈ సందర్భంగా మంత్రి వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తూ ముందుకు సాగుతోందన్నారు. ఆరు గ్యారెంటీలతో పాటు ప్రభుత్వం అమలు చేస్తున్న నూతన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించడమే సిద్దిపేట సభ ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు. రూ.5 లక్షల జీవిత బీమా కల్పించే ఇందిరమ్మ కుటుంబ బీమా పథకం పేద, సామాన్య కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించనుందని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా రెండు లక్షల ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం చేపట్టి పేదల సొంతింటి కలను సాకారం చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.
20 లక్షల మంది విద్యార్థులకు బ్రేక్ఫాస్ట్ పథకం, సన్నబియ్యం పంపిణీ, కొత్త రేషన్ కార్డులు, కొత్త పెన్షన్లు, ఇందిరమ్మ ఇళ్ల వంటి కార్యక్రమాల ద్వారా ప్రజలకు సంక్షేమ ఫలాలు అందిస్తున్నట్లు వివరించారు.
మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. సిద్దిపేట సభలో ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలపై ముఖ్యమంత్రి సమగ్రంగా వివరించనున్నారని తెలిపారు. 200 యూనిట్ల ఉచిత విద్యుత్, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రైతులకు బోనస్, రుణమాఫీ, రైతు భరోసా, కొత్త రేషన్ కార్డులు, సన్నబియ్యం పంపిణీ వంటి పథకాల అమలు తీరును ప్రజలకు తెలియజేయనున్నట్లు చెప్పారు.
మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాల పరిమితిని రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచిన అంశంతో పాటు ఉద్యోగ నియామకాలు, పెండింగ్ సాగునీటి ప్రాజెక్టుల పూర్తి తదితర అంశాలను కూడా సీఎం ప్రస్తావిస్తారని తెలిపారు. ప్రభుత్వం ఇప్పటివరకు చేపట్టిన కార్యక్రమాలతో పాటు భవిష్యత్తులో అమలు చేయనున్న అభివృద్ధి, సంక్షేమ ప్రణాళికలను ప్రజల ముందుంచనున్నారని వెల్లడించారు.
ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలనే సంకల్పంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. సంక్షేమం, అభివృద్ధికి సమాన ప్రాధాన్యతనిస్తూ పాలన కొనసాగిస్తున్నట్లు తెలిపారు.
ఈ నెల 19న సిద్దిపేటలో జరిగే సీఎం బహిరంగ సభకు సిద్దిపేటతో పాటు దుబ్బాక, గజ్వేల్, హుస్నాబాద్, మానకొండూర్, సిరిసిల్ల తదితర నియోజకవర్గాల నుంచి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి సభను విజయవంతం చేయాలని మంత్రులు పిలుపునిచ్చారు.
సభా ఏర్పాట్ల పరిశీలనలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, జిల్లా కలెక్టర్ హైమవతి, నియోజకవర్గ ఇన్చార్జీలు పూజల హరికృష్ణ, చెరుకు శ్రీనివాస్ రెడ్డి, కొమ్మూరి ప్రతాప్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్లు, గ్రామాల సర్పంచులు, కాంగ్రెస్ నాయకులు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
