ఖేలో ఇండియాలో తెలంగాణకు ఖో ఖో స్వర్ణమే లక్ష్యం
క్రీడాకారులకు మెరుగైన శిక్షణ, వసతులు కల్పిస్తున్నాం
మక్తల్‌లో ఖో ఖో క్రీడాకారుల ఎంపిక శిబిరాన్ని సందర్శించిన మంత్రి వాకిటి శ్రీహరి
మక్తల్, నవంబర్ 9: ఖేలో ఇండియా క్రీడల్లో తెలంగాణ ఖో ఖో జట్టు స్వర్ణ పతకం సాధించడమే లక్ష్యంగా క్రీడాకారులను సిద్ధం చేస్తున్నామని రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లోని క్రీడా ప్రతిభను వెలికితీసి జాతీయ స్థాయిలో అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందన్నారు.
సోమవారం మక్తల్ క్రీడా మైదానంలో ఖేలో ఇండియా ఎంపికల్లో భాగంగా ఖో ఖో క్రీడాకారులకు నిర్వహిస్తున్న శిక్షణ శిబిరాన్ని మంత్రి సందర్శించారు. క్రీడాకారులకు కల్పిస్తున్న వసతులు, శిక్షణ ఏర్పాట్లను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. క్రీడాకారులతో పాటు జిల్లా క్రీడా శాఖ అధికారి వెంకటేష్‌తో మాట్లాడి వారి సాధన, శిక్షణ వివరాలను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. మక్తల్‌లో ఖో ఖో క్రీడకు సంబంధించి మొత్తం మూడు ఎంపిక శిబిరాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ నెల 1వ తేదీన మొదటి శిబిరం ప్రారంభమైందని, మూడు శిబిరాల ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ప్రతిభ కనబరిచిన 15 మంది క్రీడాకారులను ఎంపిక చేయనున్నట్లు వెల్లడించారు.
డిసెంబర్ 11 నుంచి ప్రారంభం కానున్న ఖేలో ఇండియా క్రీడల్లో తెలంగాణ క్రీడాకారులు అత్యుత్తమ ప్రతిభ కనబరచాలని ఆకాంక్షించారు. ముఖ్యంగా ఖో ఖో విభాగంలో రాష్ట్ర జట్టు స్వర్ణ పతకం సాధించి జాతీయ స్థాయిలో తెలంగాణ కీర్తి ప్రతిష్ఠలను చాటాలని పిలుపునిచ్చారు.
క్రీడాకారులకు నాణ్యమైన శిక్షణ, మెరుగైన వసతులు కల్పిస్తే తెలంగాణ యువత అంతర్జాతీయ స్థాయిలోనూ రాణించే సత్తా కలిగి ఉందని మంత్రి అన్నారు. క్రీడలను ప్రోత్సహించడం, గ్రామీణ ప్రాంతాల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీయడం ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. క్రీడాకారులు పట్టుదల, క్రమశిక్షణతో నిరంతరం సాధన చేస్తూ విజయాలు సాధించాలని సూచించారు.
