సంపాదనలో 10 శాతం పేదల సేవకు కేటాయించాలి
‘అమ్మ’ నిస్వార్థ సేవ సమాజానికి ఆదర్శం.. పేదలకు అండగా నిలవడమే నిజమైన ఆత్మసంతృప్తి
సికింద్రాబాద్ బ్రహ్మస్థాన ఆలయ 25వ వార్షికోత్సవంలో మంత్రి వివేక్ వెంకటస్వామి
మహిళలకు చీరలు, దివ్యాంగులకు వీల్చైర్ల పంపిణీ
హైదరాబాద్, నవంబర్ 11: ప్రతి ఒక్కరూ తమ సంపాదనలో కనీసం 10 శాతాన్ని పేదల సంక్షేమం, సేవా కార్యక్రమాలకు కేటాయించాలని శక్తి, గనుల శాఖ మంత్రి డాక్టర్ గడ్డం వివేక్ వెంకటస్వామి పిలుపునిచ్చారు. నిరుపేదలకు అండగా నిలిచి, నిస్వార్థంగా సేవ చేయడం ద్వారానే నిజమైన మానసిక ప్రశాంతత, ఆత్మసంతృప్తి లభిస్తాయని అన్నారు. శ్రీ మాతా అమృతానందమయీ దేవి (అమ్మ) దశాబ్దాలుగా కొనసాగిస్తున్న సేవా కార్యక్రమాలు సమాజానికి ఆదర్శమని కొనియాడారు.
భారత యాత్రలో భాగంగా బుధవారం హైదరాబాద్కు విచ్చేసిన అమ్మ.. సికింద్రాబాద్లోని మహేంద్ర హిల్స్ బ్రహ్మస్థాన ఆలయ 25వ వార్షికోత్సవ రజతోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి వివేక్ వెంకటస్వామి మహిళలకు చీరలు, దివ్యాంగులకు వీల్చైర్లను పంపిణీ చేశారు. అనంతరం అమ్మ ఆశీస్సులు అందుకున్నారు. ఆమె నిస్వార్థ సేవా కార్యక్రమాలను ప్రశంసించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రభుత్వం తరఫున ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు. అమ్మ ఆశీస్సులు పొందడం ఎంతో సంతోషాన్ని, ఆధ్యాత్మిక బలాన్ని ఇచ్చిందన్నారు. ఉన్నత పదవులు, అధికార బాధ్యతలు లభించేది పేదలకు, సమాజంలోని అణగారిన వర్గాలకు సేవ చేయడానికేనన్న అమ్మ బోధన ఎంతో విలువైనదని పేర్కొన్నారు.
కరోనా సంక్షోభ సమయంలోనూ అమ్మ అభాగ్యులకు అందించిన సేవలు వెలకట్టలేనివని కొనియాడారు. నిస్వార్థ సేవతోనే సమాజంలో నిజమైన మార్పు సాధ్యమవుతుందని అన్నారు. ఇతరులకు సాయం చేసినప్పుడు మనసులో సానుకూలత పెరగడంతో పాటు మానసిక ప్రశాంతత లభిస్తుందని వివరించారు. అమ్మలో కనిపించే ఆధ్యాత్మిక శక్తికి ఆమె దశాబ్దాలుగా కొనసాగిస్తున్న సేవా కార్యక్రమాలే ప్రధాన స్ఫూర్తి అని పేర్కొన్నారు. అమ్మను దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు, ప్రజలు స్వచ్ఛందంగా తరలిరావడం ఆమె సేవా నిరతికి నిదర్శనమన్నారు.
కంటోన్మెంట్ నియోజకవర్గంలో ఇలాంటి పవిత్ర సేవా కేంద్రం ఉండటం ఈ ప్రాంత ప్రజలకు గర్వకారణమని మంత్రి అన్నారు. ఈ సందర్భంగా అమ్మ దివ్యబోధనలకు సంబంధించిన పుస్తకాన్ని ఆవిష్కరించారు. తెలంగాణలో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టేందుకు తమ ట్రస్ట్ సిద్ధంగా ఉందని అమ్మ హామీ ఇచ్చినట్లు వెల్లడించారు. నిరుపేదలు, అణగారిన వర్గాలకు అండగా నిలిచే సేవా కార్యక్రమాలను మరింత విస్తరించాల్సిన అవసరం ఉందని మంత్రి వివేక్ వెంకటస్వామి పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేశ్, మాతా అమృతానందమయి మఠం ప్రతినిధులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.
