రాజకీయాలకు అతీతంగా ప్రేమానురాగాలు పంచే వేదిక ‘అలయ్ బలయ్’
అన్ని పార్టీల నాయకులను ఒకే తాటిపైకి తీసుకొచ్చే సంస్కృతి దత్తాత్రేయకే సాధ్యం
రాజకీయాల్లో శత్రుత్వం కాదు.. స్నేహం, ఆత్మీయత ఉండాలి
అలయ్ బలయ్ కోసం ఎంత బిజీగా ఉన్నా సమయం కేటాయిస్తా: మంత్రి వివేక్ వెంకటస్వామి
హైదరాబాద్, అక్టోబర్ 22: రాజకీయ వైరుధ్యాలను పక్కనబెట్టి, అన్ని పార్టీల నాయకులను ఒకే వేదికపైకి తీసుకొచ్చి ప్రేమానురాగాలు, ఆత్మీయతను చాటిచెప్పే గొప్ప సంప్రదాయం ‘అలయ్ బలయ్’ అని శక్తి, గనుల శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. బండారు దత్తాత్రేయ ఏటా దసరా పండుగ సందర్భంగా ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే అలయ్ బలయ్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. దసరా పండుగ సమాజానికి అందించే స్నేహం, ఐక్యత సందేశాలను అలయ్ బలయ్ కార్యక్రమం ద్వారా దత్తాత్రేయ చాటిచెబుతున్నారని అన్నారు. రాజకీయాల్లో పార్టీలు, సిద్ధాంతాలు వేరైనా అందరినీ ఒకే వేదికపైకి తీసుకొచ్చి పరస్పరం కలుసుకునే గొప్ప అవకాశం ఈ కార్యక్రమం కల్పిస్తోందని పేర్కొన్నారు.
ఎంత బిజీగా ఉన్నప్పటికీ అలయ్ బలయ్ కార్యక్రమానికి తప్పకుండా హాజరవుతానని వివేక్ వెంకటస్వామి స్పష్టం చేశారు. అన్ని రాజకీయ పార్టీల ముఖ్య నాయకులు, సన్నిహితులు, బంధువులు ఒకే వేదికపై కలుసుకోవడం ఈ కార్యక్రమ ప్రత్యేకత అని అన్నారు.
రాజకీయ నాయకుల మధ్య ఉండాల్సింది శత్రుభావం కాదని, ప్రజల కోసం పనిచేస్తూనే పరస్పర గౌరవం, స్నేహభావంతో మెలగాలని ఈ వేదిక గుర్తుచేస్తోందని మంత్రి తెలిపారు. ఈ విధమైన ‘దోస్తానా’ సంస్కృతి ప్రతి ఒక్కరిలోనూ, ముఖ్యంగా రాజకీయ నాయకుల్లో ఉండాల్సిన అవసరం ఉందన్నారు. ఇలాంటి ఆత్మీయ వాతావరణం సమాజంలో సామరస్యాన్ని పెంపొందించేందుకు దోహదపడుతుందని పేర్కొన్నారు.
తెలంగాణ సంస్కృతి, సామరస్యానికి ప్రతీకగా నిలిచే అలయ్ బలయ్ కార్యక్రమం ప్రతి ఏటా మరింత ఉత్సాహంగా, విజయవంతంగా కొనసాగాలని మంత్రి ఆకాంక్షించారు. కార్యక్రమ నిర్వాహకులకు, బండారు దత్తాత్రేయకు ప్రత్యేక అభినందనలు తెలిపారు.
