ముదిరాజుల ఐక్యతతోనే రాజకీయ సాధికారత
బలహీన వర్గాల ఐక్యతను దెబ్బతీసే విభజన రాజకీయాల పట్ల అప్రమత్తంగా ఉండాలి: మంత్రి వివేక్ వెంకటస్వామి
హైదరాబాద్, అక్టోబర్ 22: ముదిరాజ్ సమాజం ఐక్యంగా ముందుకు సాగినప్పుడే రాజకీయ సాధికారత సాధ్యమవుతుందని శక్తి, గనుల శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. బలహీన వర్గాల ఐక్యతను దెబ్బతీసే విభజన రాజకీయాల పట్ల అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. తెలంగాణ సాయుధ పోరాట యోధుడు పండుగ సాయన్న 174వ జయంతి ఉత్సవాల్లో గురువారం పాల్గొన్న మంత్రి ఈ మేరకు ప్రసంగించారు.
కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముదిరాజ్ సమాజానికి ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రాధాన్యత కల్పిస్తున్నారని మంత్రి తెలిపారు. భవిష్యత్తులోనూ ముదిరాజ్ సమాజానికి మరిన్ని కీలక పదవులు, అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు.
చెన్నూరు నియోజకవర్గంలో ముదిరాజ్ సోదరుల సంక్షేమానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నామని వివేక్ వెంకటస్వామి వెల్లడించారు. గత మున్సిపల్ ఎన్నికల్లో 16 వార్డులకు గాను ముగ్గురు ముదిరాజ్ అభ్యర్థులకు టికెట్లు కేటాయించి, వారిని గెలిపించుకున్నామని చెప్పారు. ముదిరాజ్ సమాజం చిరకాలంగా కోరుతున్న భవన్ నిర్మాణానికి రూ.50 లక్షలు మంజూరు చేశామని, పనులు వేగంగా జరుగుతున్నాయని తెలిపారు. మరో రెండు, మూడు నెలల్లో భవన నిర్మాణం పూర్తవుతుందని, ప్రారంభోత్సవానికి ముదిరాజ్ సోదరులు పెద్ద సంఖ్యలో హాజరుకావాలని ఆహ్వానించారు.
ముదిరాజ్ సమాజానికి జన బలం ఉందని, దానిని ఐక్యతతో రాజకీయ బలంగా మలచుకోవాలని మంత్రి సూచించారు. బలహీన వర్గాల్లో చీలికలు సృష్టించి, వారిని వేర్వేరు వర్గాలుగా విడదీసి బలహీనపరిచేందుకు కొన్ని శక్తులు ప్రయత్నిస్తుంటాయని అన్నారు. ఇలాంటి విభజన రాజకీయాలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు.
ముదిరాజ్ సమాజమంతా ఒకే లక్ష్యంతో ఐక్యంగా ముందుకు సాగినప్పుడే తమ హక్కులను సాధించుకోవడంతో పాటు ప్రజాస్వామ్యంలో తగిన గౌరవం, రాజకీయ ప్రాతినిధ్యం పొందగలుగుతారని మంత్రి వివేక్ వెంకటస్వామి పేర్కొన్నారు.
