హైదరాబాద్: అశోక్ నగర్ లో సివిల్ సర్వీసెస్ పరీక్షల కోసం సిద్ధమవుతున్న ఓ యువకుడు హాస్టల్ భవనంపై నుంచి కిందపడి మృతి చెందిన విషాద ఘటన హైదరాబాద్ అశోక్ నగర్ లో చోటుచేసుకుంది. భూపాలపల్లి జిల్లా, అంబటి పల్లె కి చెందిన విద్యార్థి గత రెండేళ్లుగా అశోక్ నగర్ లోని హాస్టల్లో ఉంటూ కోచింగ్ తీసుకుంటున్నాడు.
ఘటన వివరాలు: మృతుడిని భూపాలపల్లి జిల్లా, అంబటిపల్లి గ్రామానికి చెందిన బాసనీ ఆనంద్ (26) గా గుర్తించారు. గురువారం తెల్లవారుజామున సుమారు 2 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది.
ఆనంద్ హాస్టల్‌లోని మూడవ అంతస్తులో ఉన్న తన రూమ్ నుంచి వాష్ రూమ్ కోసం బయటకు వచ్చాడు. ఈ క్రమంలో, అదుపు తప్పి కింద పడిపోయినట్లు తెలుస్తోంది. తీవ్ర గాయాలపాలైన ఆనంద్ అక్కడికక్కడే స్పృహ కోల్పోయాడు. వెంటనే స్పందించిన హాస్టల్ సిబ్బంది ఆనంద్‌ను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స కోసం సికింద్రాబాద్‌లోని యశోదా హాస్పిటల్‌కు రిఫర్ చేశారు. అక్కడ చికిత్స పొందుతూ ఆనంద్ మరణించినట్లు డాక్టర్లు ధృవీకరించారు.ఆనంద్ మరణానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదవశాత్తు జరిగిందా? లేక ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా? అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. యువకుడి మృతితో కుటుంబ సభ్యులు, తోటి విద్యార్థులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.

