మందమర్రిలో 600 ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం
అర్హులందరికీ సంక్షేమ ఫలాలు.. పెన్షన్లకు మరోసారి సర్వే
చెన్నూరు అభివృద్ధికి రూ.800 కోట్లు.. తాగునీటి కోసం రూ.100 కోట్లు
పేదల సొంతింటి కల నెరవేరుస్తాం.. ప్రతి కుటుంబానికీ అండగా ఉంటాం: మంత్రి వివేక్ వెంకటస్వామి
మందమర్రి, నవంబర్ 17: పేదల సంక్షేమమే ప్రజాపాలన ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని శక్తి, గనుల శాఖ మంత్రి డా. గడ్డం వివేక్ వెంకటస్వామి అన్నారు. అర్హత ఉండి వివిధ కారణాలతో పెన్షన్లు పొందలేకపోయిన వారికి మరోసారి సర్వే నిర్వహించి పెన్షన్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. మందమర్రి ఏజెన్సీ ప్రాంతంలో ఆరు ఎకరాల స్థలంలో సుమారు 600 ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి త్వరలో చర్యలు చేపడతామని వెల్లడించారు. పేద కుటుంబాలకు సొంతింటి కల నెరవేర్చడంతో పాటు ఆత్మగౌరవంతో జీవించేలా ప్రభుత్వం అండగా ఉంటుందని స్పష్టం చేశారు.
మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం గద్దెరాగడిలోని ఎన్వీఆర్ గార్డెన్లో క్యాతనపల్లి, మందమర్రి మున్సిపాలిటీలు, మందమర్రి మండల పరిధిలోని లబ్ధిదారులకు చేయూత పెన్షన్ మంజూరు పత్రాల పంపిణీ కార్యక్రమానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. లబ్ధిదారులకు మంజూరు పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, అదనపు కలెక్టర్ చంద్రయ్య, ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా నాలుగు లక్షలకు పైగా పెన్షన్లు మంజూరు చేయడం పేదల సంక్షేమం పట్ల ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనమన్నారు. గత పదేళ్ల పాలనలో పేదలకు కొత్త రేషన్ కార్డులు, పెన్షన్లు అందించడంలో నిర్లక్ష్యం జరిగిందని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ప్రజలకు ఇచ్చిన హామీలను దశలవారీగా అమలు చేస్తోందన్నారు. పెన్షన్ అనేది కేవలం ఆర్థిక సాయం మాత్రమే కాదని, వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, గీత, చేనేత కార్మికులు ఆత్మగౌరవంతో జీవించేందుకు అందించే భరోసా అని పేర్కొన్నారు. అర్హత ఉండి పెన్షన్లు రాని వారి వివరాలను క్షేత్రస్థాయిలో మరోసారి పరిశీలించి నిజమైన లబ్ధిదారులకు న్యాయం చేస్తామని తెలిపారు.
మందమర్రిలో 600 ఇందిరమ్మ ఇళ్లు
ప్రతి పేద కుటుంబానికి సొంతిల్లు ఉండాలన్నదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లక్ష్యమని మంత్రి తెలిపారు. చెన్నూరు నియోజకవర్గంలో గత ఏడాది 3,500 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు కాగా, ఈ ఏడాది మరో 2,000 ఇళ్లు మంజూరయ్యాయని వెల్లడించారు. ఇప్పటివరకు మొత్తం 5,500 ఇళ్లు మంజూరు కాగా, 1,800 ఇళ్ల నిర్మాణం పూర్తయిందన్నారు. మందమర్రి ఏజెన్సీ ప్రాంతంలో భూమి సమస్య కారణంగా ఇళ్ల నిర్మాణానికి ఇబ్బందులు ఎదురవుతున్నాయని, దీనిని పరిష్కరించేందుకు సింగరేణి సంస్థతో చర్చించి ఆరు ఎకరాల భూమి కేటాయించాలని ప్రతిపాదించామన్నారు. సంస్థ సానుకూలంగా స్పందించిందని, ఆ భూమిలో ప్రత్యేక విధానం ద్వారా సుమారు 600 ఇళ్ల నిర్మాణానికి చర్యలు చేపడతామని వివరించారు. సొంత భూమి లేని పేదలకు కూడా ఇళ్లు మంజూరు చేసేలా తదుపరి దశలో ప్రణాళికలు రూపొందిస్తున్నామని చెప్పారు.
చెన్నూరు అభివృద్ధికి రూ.800 కోట్లు
చెన్నూరు నియోజకవర్గ అభివృద్ధికి సుమారు రూ.800 కోట్లతో వివిధ పనులు చేపట్టినట్లు మంత్రి వెల్లడించారు. గ్రామాలు, పట్టణాల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థలను అభివృద్ధి చేస్తామన్నారు. అమృత్ పథకం కింద తాగునీటి సమస్య పరిష్కారానికి రూ.100 కోట్లు కేటాయించామని తెలిపారు. క్యాతన్‌పల్లికి రూ.40 కోట్లు, చెన్నూరుకు రూ.30 కోట్లు, మందమర్రికి రూ.30 కోట్లు ఖర్చు చేయనున్నట్లు వివరించారు. మరో ఆరు నెలల్లో పనులు పూర్తి చేసి ఇంటింటికీ తాగునీరు అందించేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు.
విద్య, వైద్య రంగాలకు ప్రాధాన్యం
విద్యారంగ అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నామని, మందమర్రిలో తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాటుకు రూ.10 కోట్లు మంజూరయ్యాయని తెలిపారు. సోమన్‌పల్లిలో రూ.200 కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయని, వచ్చే ఏడాదికి పాఠశాలను అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. చెన్నూరులో 100 పడకల ఆసుపత్రి నిర్మాణం పూర్తయిందని, త్వరలో ప్రారంభిస్తామని తెలిపారు. ఆసుపత్రికి సుమారు 20 మంది వైద్యుల పోస్టులు మంజూరయ్యాయని, దీంతో చుట్టుపక్కల మండలాల ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయన్నారు. మందమర్రిలో సింగరేణి ఆధ్వర్యంలో మరో 50 పడకల ఆసుపత్రి నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నామని వెల్లడించారు.
యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు
మంచిర్యాల ప్రాంతంలో కొత్త బొగ్గు గనుల ఏర్పాటుతో స్థానిక యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరుగుతాయని మంత్రి అన్నారు. ప్రస్తుతం ఆర్కే ఓసీలో కొత్త బొగ్గు గని రాబోతోందని, అటవీ అనుమతులు లభించిన తర్వాత పనులు ముందుకు సాగుతాయని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ విధానం ప్రకారం బొగ్గు గనుల వేలంలో పాల్గొనడం ద్వారానే కొత్త గనులు సాధ్యమవుతాయని వివరించారు.
పుష్కరాల పనులకు రూ.70 కోట్లు
రానున్న గోదావరి పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని చెన్నూరు నియోజకవర్గంలో భక్తులకు అవసరమైన సౌకర్యాల కల్పనకు రూ.70 కోట్లు మంజూరు చేయించినట్లు మంత్రి తెలిపారు. వచ్చే ఏప్రిల్ నాటికి పనులు పూర్తి చేస్తామన్నారు. బొక్కలగుట్ట, అందుగులపేట, సండ్రులపల్లి, పులిమడుగు గ్రామాల్లో కల్వర్టుల నిర్మాణానికి నిధులు మంజూరయ్యాయని చెప్పారు. గ్రామీణ రహదారుల అభివృద్ధికి పంచాయతీరాజ్ శాఖ ద్వారా రూ.80 కోట్లు, ఆర్ అండ్ బీ రహదారుల కోసం మరో రూ.63 కోట్లు మంజూరయ్యాయని వెల్లడించారు.
ఎల్‌నినోపై రైతులు అప్రమత్తంగా ఉండాలి
రాష్ట్రంలో ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉన్నందున ప్రజలు, రైతులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి సూచించారు. తాగునీటిని పొదుపుగా వినియోగించాలని, వరికి బదులుగా ఆరుతడి, ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి పెట్టాలని కోరారు. రాష్ట్రంలో సుమారు 35 లక్షల బోర్లు ఉండటంతో వ్యవసాయ అవసరాలకు విద్యుత్ వినియోగం పెరుగుతోందని పేర్కొన్నారు.
200 యూనిట్ల ఉచిత విద్యుత్, సన్నబియ్యం పంపిణీ, ఇందిరమ్మ ఇళ్లు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, స్వయం సహాయక సంఘాలకు వడ్డీలేని రుణాలు వంటి పథకాలతో పేద కుటుంబాలకు ప్రయోజనం కలుగుతోందన్నారు. మిగిలిన హామీలను కూడా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగుపడిన తర్వాత అమలు చేస్తామని తెలిపారు. పేదల సంక్షేమం, విద్య, వైద్యం, మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యతనిస్తూ చెన్నూరు నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని మంత్రి వివేక్ వెంకటస్వామి స్పష్టం చేశారు.
