జర్మన్ భాష నేర్చుకోవడంలో క్రమశిక్షణ, నిరంతర సాధనే విజయానికి మార్గం: మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి
హైదరాబాద్, జూన్ 15: విదేశీ భాషలు, ముఖ్యంగా జర్మన్ భాషను నేర్చుకునే విద్యార్థులు క్రమశిక్షణ, నిరంతర సాధనతో ముందుకు సాగాలని రాష్ట్ర కార్మిక, ఉపాధి మరియు గనుల శాఖ మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి సూచించారు. తద్వారా అంతర్జాతీయ స్థాయిలో ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకోవచ్చని అన్నారు.
సోమవారం టామ్కామ్ (TOMCOM) కార్యాలయంలో జర్మన్ భాషా శిక్షణ పొందుతున్న విద్యార్థులు, అధ్యాపకులతో మంత్రి సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, జర్మనీలో ఉద్యోగాలు పొందాలనే లక్ష్యంతో ఉన్న యువత కోసం టామ్కామ్ జర్మన్ భాషా శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తోందన్నారు. భారత దేశం లో నర్సింగ్, ఇంజినీరింగ్ తదితర రంగాల్లో ఉపాధి అవకాశాలు ఉన్నప్పటికీ, జర్మనీలో పనిచేసే వారికి లభించే వేతనాలు మన కరెన్సీ విలువలో ఎంతో అధికంగా ఉంటాయని పేర్కొన్నారు.
“కొత్త భాషను నేర్చుకుని జర్మనీ వంటి దేశాల్లో ఉద్యోగాలు సాధించడం మన యువతకు ఒక గొప్ప అవకాశంగా నిలుస్తుంది” అని మంత్రి అన్నారు.
ఇటీవల మంచిర్యాల జిల్లా మందమర్రిలో ప్రారంభించిన జర్మన్ భాషా తరగతులకు విశేష స్పందన లభించిందని తెలిపారు. “దాదాపు 200 మంది యువత ఈ కోర్సులో చేరడం నాకు ఆనందాన్ని కలిగించింది. అక్కడి అధ్యాపకుడు కూడా ఎంతో ప్రతిభావంతుడిగా కనిపించారు” అని పేర్కొన్నారు.
విద్యార్థులు సమర్థవంతంగా భాషను నేర్చుకునేలా వారి హాజరును నిరంతరం పర్యవేక్షిస్తున్నామని మంత్రి తెలిపారు. విదేశీ ఉపాధి అవకాశాలను పొందడంలో భాషా ప్రావీణ్యమే ప్రధాన అడ్డంకి అని, దానిని అధిగమించాల్సిన అవసరం ఉందన్నారు.
విద్యార్థులు ఒక్క తరగతిని కూడా మిస్ కాకుండా క్రమం తప్పకుండా హాజరవుతూ, భాషలో ఉన్నత స్థాయి ప్రావీణ్యాన్ని సాధించాలని సూచించారు. “ప్రతి విద్యార్థి క్రమశిక్షణతో తరగతులకు హాజరై భాషపై పూర్తి పట్టు సాధించాలి” అని మంత్రి అన్నారు.
తన వ్యక్తిగత అనుభవాన్ని పంచుకుంటూ, తాను కూడా నిరంతర సాధన, పట్టుదలతోనే తెలుగు భాషను నేర్చుకున్నానని చెప్పారు. ఏ భాషనైనా నేర్చుకోవాలంటే నిరంతర అభ్యాసమే విజయానికి మూలమని వివరించారు.
ఇలాంటి భాషా శిక్షణ కార్యక్రమాలు యువతకు మెరుగైన ఉపాధి అవకాశాలను అందించడంతో పాటు అంతర్జాతీయ స్థాయిలో విజయవంతమైన కెరీర్ను నిర్మించుకునేందుకు దోహదపడతాయని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు.
