యూరప్ ఉద్యోగాలకు తెలంగాణ యువతకు గ్లోబల్ స్కిల్స్
టామ్‌కామ్‌తో భారత్–యూరప్ నైపుణ్య భాగస్వామ్యాన్ని బలోపేతం చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం
G. Vivek Venkatswamy నేతృత్వంలో తెలంగాణ ప్రభుత్వం యువతకు అంతర్జాతీయ స్థాయిలో ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రత్యేక కార్యాచరణ చేపట్టింది. విదేశీ ఉద్యోగ అవకాశాలు, నైపుణ్యాభివృద్ధి, భాషా శిక్షణపై దృష్టి సారిస్తూ టామ్‌కామ్‌ను మరింత బలోపేతం చేస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. ఇందుకోసం రాష్ట్ర బడ్జెట్‌లో రూ.90 కోట్లు కేటాయించినట్లు తెలిపారు.
హైదరాబాద్‌లోని The Park Hyderabad లో బుధవారం నిర్వహించిన భారత్–యూరోపియన్ యూనియన్ మొబిలిటీపై రాష్ట్ర స్థాయి వర్క్‌షాప్‌లో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. విదేశాంగ మంత్రిత్వ శాఖ, European Union సంయుక్త ఆధ్వర్యంలో ఇండియా–ఈయూ మైగ్రేషన్ అండ్ మొబిలిటీ ప్రాజెక్ట్ ఫేజ్–2లో భాగంగా ఈ కార్యక్రమం జరిగింది.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ యూరప్ దేశాల్లో ప్రస్తుతం నైపుణ్యవంతులైన ఉద్యోగుల కొరత తీవ్రంగా ఉందన్నారు. మరోవైపు భారత్‌లో నైపుణ్యాలు అభ్యసించేందుకు సిద్ధంగా ఉన్న యువశక్తి అధికంగా ఉందని చెప్పారు. ఈ అవకాశాన్ని ముందుగానే గుర్తించిన తెలంగాణ ప్రభుత్వం యువతను గ్లోబల్ కెరీర్లకు సిద్ధం చేస్తోందన్నారు.
టామ్‌కామ్ ద్వారా విదేశీ ఉపాధి అవకాశాలపై అవగాహన, శిక్షణ, మార్గనిర్దేశం అందిస్తున్నామని తెలిపారు. ముఖ్యంగా జర్మన్ భాష సహా విదేశీ భాషల్లో శిక్షణ పొందిన వారికి యూరప్ దేశాల్లో మంచి డిమాండ్ ఉందన్నారు. ఇప్పటికే టామ్‌కామ్ శిక్షణ పొందిన పలువురు యువత విదేశాల్లో విజయవంతంగా ఉద్యోగాలు చేస్తున్నారని పేర్కొన్నారు.
అక్రమ మార్గాల ద్వారా విదేశాలకు వెళ్లడం ప్రమాదకరమని, చట్టబద్ధమైన మరియు సురక్షితమైన మార్గాల ద్వారానే విదేశీ ఉపాధి అవకాశాలను వినియోగించుకోవాలని ప్రభుత్వం యువతకు అవగాహన కల్పిస్తోందన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్లు ఏర్పాటు చేసి, జాతీయ–అంతర్జాతీయ ఉద్యోగ మార్కెట్ అవసరాలకు అనుగుణంగా శిక్షణ అందిస్తున్నామని మంత్రి తెలిపారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విస్తరిస్తున్న నేపథ్యంలో భవిష్యత్ అవసరాలకు తగ్గ నైపుణ్యాలను అభివృద్ధి చేసుకున్న యువతకు ప్రపంచవ్యాప్తంగా అవకాశాలు పెరుగుతాయని పేర్కొన్నారు.
ఇటీవల జర్మనీ పర్యటనలో ఆరోగ్య, తయారీ, సాంకేతిక, సేవా రంగాల్లో నైపుణ్యవంతులైన మానవ వనరులకు భారీ డిమాండ్ ఉన్నట్లు ప్రత్యక్షంగా గమనించామని మంత్రి వెల్లడించారు. తెలంగాణలో భాషా శిక్షణపై పైలట్ ప్రాజెక్టులు అమలు చేస్తూ యువతకు సురక్షితమైన విదేశీ ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా ప్రభుత్వం పనిచేస్తోందన్నారు.
ఈ కార్యక్రమంలో విదేశాంగ మంత్రిత్వ శాఖ అండర్ సెక్రటరీ ఆదర్శ్ కుమార్ మెహ్రా, ఎల్‌ఈటీఎఫ్ కార్యదర్శి దాసరి హరిచందన, ఉపాధి మరియు శిక్షణ విభాగం డైరెక్టర్ కాంతి వెస్లీ, రీజినల్ పాస్‌పోర్ట్ అధికారి జే. స్నేహాజ, ఐసీడబ్ల్యూఏ జాయింట్ సెక్రటరీ అభిజిత్ చక్రబోర్తి తదితరులు పాల్గొన్నారు.
