ఆశావహులకు తీపికబురు.. స్థానిక ఎన్నికలపై ఎస్‌ఈసీ కీలక ప్రకటన

whatsapp image 2025 11 19 at 9.14.21 pm

రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం (State Election Commission) వేగంగా కసరత్తు చేపట్టింది.

ఈ క్రమంలో పంచాయతీలకు సంబంధించిన ఓటర్ల జాబితాను మరోసారి సవరించేందుకు షెడ్యూల్‌ను ఎస్‌ఈసీ ఇవాళ ప్రకటించింది. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ పంచాయతీల్లో రేపటి నుంచి నవంబర్ 23 వరకు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించనుంది. ఈ నాలుగు రోజుల్లో గ్రామాల్లో ఓటర్ల జాబితాలను ఇంటింటి స్థాయిలో పరిశీలించి, కొత్తగా అర్హత సాధించినవారి పేర్లు చేర్చడం, మరణించిన వారి పేర్లు తొలగించడం, ఇతర సవరణలు చేపట్టనున్నారు. ప్రతి గ్రామ పంచాయతీలో బూత్ లెవెల్ ఆఫీసర్లు (BLOలు), గ్రామ రెవెన్యూ అధికారులు, స్థానిక సర్పంచ్‌ల సహకారంతో ఈ ప్రక్రియ జరుగనుంది.

కాగా, ఓటర్లు తమ పేరు జాబితాలో ఉందో లేదో తెలుసుకోవడానికి, అవసరమైన సవరణలు చేయించుకోవడానికి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎస్‌ఈసీ సూచించింది. ఇప్పటికే జులై 1, 2025 నాటి అర్హతతో రూరల్ ఓటర్ల జాబితా తుది రూపం పొందగా, ఈ చివరి సవరణ తర్వాత ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేయనున్నట్లు సమాచారం. రాష్ట్రంలో మూడు దశల్లో పంచాయతీ ఎన్నికలు జరిగే అవకాశం ఉందని, డిసెంబర్ చివరి వారంలో లేదా 2026 జనవరి మొదటి వారంలో పోలింగ్ జరగవచ్చని అధికార వర్గాలు తెలిపాయి. ఓటర్లు తమ ఓటు హక్కును కాపాడుకోవాలని, రాబోయే నాలుగు రోజుల్లో తప్పనిసరిగా జాబితా పరిశీలించుకోవాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కోరింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *