నర్సాపూర్ అభివృద్ధికి రూ.15 కోట్లుప్రజల శ్రేయస్సే లక్ష్యంగా ప్రభుత్వం: మంత్రి వివేక్ వెంకటస్వామి
హైదరాబాద్, ఏప్రిల్ 26: మెదక్ జిల్లా నర్సాపూర్ మున్సిపాలిటీకి రూ.15 కోట్లతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు రాష్ట్ర కార్మిక మరియు గనులు శాఖల మంత్రి డాక్టర్ గడ్డం వివేక్ వెంకటస్వామి శంకుస్థాపన చేశారు. పట్టణాన్ని సమగ్రంగా అభివృద్ధి చేయడానికి ప్రత్యేక మున్సిపల్ సమావేశం నిర్వహించి ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతున్నట్లు తెలిపారు.
శనివారం నర్సాపూర్ మున్సిపాలిటీ పరిధిలో మంత్రి గారు విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి, పట్టభద్రుల ఎమ్మెల్సీ అంజిరెడ్డి, జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్, మున్సిపల్ చైర్పర్సన్ లక్ష్మీ రాజ్ యాదవ్, ఇతర ప్రజాప్రతినిధులు మరియు అధికారులు పాల్గొన్నారు.
పర్యటనలో భాగంగా 4వ, 6వ వార్డుల్లో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల గృహప్రవేశ కార్యక్రమాల్లో మంత్రి పాల్గొన్నారు. లబ్ధిదారులు దుద్దాల దుర్గమ్మ, మహమ్మద్ షకీరా బేగం కుటుంబాలతో కలిసి పూజలు నిర్వహించి గృహాలను ప్రారంభించారు.
అనంతరం నారాయణపూర్ గ్రామంలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా బడిబాట కార్యక్రమాన్ని మంత్రి ప్రారంభించారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన ఉచిత విద్య అందిస్తున్నందున విద్యార్థుల నమోదు పెంచేందుకు కృషి చేయాలని సూచించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ప్రజల శ్రేయస్సే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, రాజకీయాలకు అతీతంగా అందరికీ అభివృద్ధి ఫలాలు చేరేలా పని చేయాలని అన్నారు. వేసవిలో తాగునీటి సమస్యలు రాకుండా ప్రజాప్రతినిధులు ప్రతిరోజూ సమస్యలను గుర్తించి వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. ప్రజలతో నిరంతరం మమేకమై సేవాభావంతో పనిచేస్తే మంచి ఫలితాలు సాధ్యమవుతాయని పేర్కొన్నారు.
ప్రతి ప్రజాప్రతినిధి బాధ్యతగా ప్రజలకు సేవ చేయాలని, కొత్తగా ఎన్నికైన సభ్యులు అధికారులతో సమన్వయం చేసుకొని సమస్యలను పరిష్కరించాలని మంత్రి సూచించారు. విద్యా వ్యవస్థను బలోపేతం చేయడానికి ప్రభుత్వం పటిష్ట చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో తహసీల్దారులు, జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు స్థానిక నేతలు పాల్గొన్నారు.
