జవహర్ నగర్ డంపింగ్ యార్డు నుంచి భారీ మిథేన్ ఉద్గారాలు – ప్రపంచంలోనే ప్రమాదకర ప్రాంతాల్లో నాలుగో స్థానం
హైదరాబాద్ సిటీ: నగర పరిసరాల్లో ఉన్న జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకర కాలుష్య కేంద్రాల్లో ఒకటిగా నిలిచింది. ఇప్పటికే జల కాలుష్యంతో ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్న ఈ డంపింగ్ యార్డు, ఇప్పుడు మిథేన్ వంటి విష వాయువులను అత్యధికంగా విడుదల చేయడం మరింత ప్రమాదకరంగా మారింది.
ఇటీవల యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా, లాస్ ఏంజెల్స్ ఆధ్వర్యంలో ‘స్టాప్ మిథేన్ ప్రాజెక్ట్’ కింద నిర్వహించిన పరిశోధనలో భయంకరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. యూసీఎల్ఏ ప్రొఫెసర్లు, రీసర్చ్ అప్డ్‌లు జవహర్ నగర్ డంపింగ్ యార్డు పరిస్థితిని పరిశీలించి ఆందోళన వ్యక్తం చేశారు. ఇక్కడ పేరుకుపోయిన చెత్త దుర్వాసనకే కాకుండా భూగోళాలను పెంచడంలో కీలక పాత్ర పోషించారని వారు తేల్చారు.
పరిశోధన ప్రకారం, ఈ డంపింగ్ యార్డు నుంచి గంటకు సుమారు 5.9 టన్నుల మిథేన్ వాయువు విడుదలవుతోంది. ఈ మిథేన్ ప్రభావం కార్బన్ డయాక్సైడ్ దాదాపు 86 రెట్లు ఎక్కువగా ఉన్నట్లు శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. అదనంగా, ఈ ఉద్గారాలు రోడ్లపై తిరిగే సుమారు 12 లక్షల కార్లు విడుదల చేస్తే కాలుష్యానికి సమానమని పేర్కొన్నారు.
ప్రపంచవ్యాప్తంగా 700కి పైగా డంపింగ్ యార్డులను పరిశీలించగా, జవహర్ నగర్ డంపింగ్ యార్డు కాలుష్య ఉద్గారాల్లో ప్రపంచంలో నాలుగో స్థానంలో నిలిచింది. టాప్ 25లో భారత్‌కు చెందిన మరో డంపింగ్ యార్డు కంజుర్ మార్గ్ డంపింగ్ గ్రౌండ్ కూడా ఉంది. అక్కడ గంటకు 4.9 టన్నుల మిథేన్ విడుదలవుతుండగా, అర్జెంటీనాలోని బ్యూనస్ ఎయిర్స్ డంపింగ్ యార్డు గంటకు 7.9 టన్నులతో మొదటి స్థానంలో ఉంది.
పర్యావరణ నిపుణుల ప్రకారం, మిథేన్ వాయువు గ్లోబల్ వార్మింగ్‌లో 45 సంవత్సరాలకు పైగా పాత్ర పోషిస్తోంది. ఈ వాయువు సూర్యకాంతితో కలిసినప్పుడు గ్రౌండ్ లెవల్ ఓజోన్ ఏర్పడి, ఆస్తమా వంటి శ్వాసకోశ వ్యాధులను పెంచుతుంది. డంపింగ్ యార్డు పరిసరాల్లో నివసించే ప్రజలకు తలనొప్పి, తల తిరగడం, వాంతులు, అలసట వంటి సమస్యలు కనిపించే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు.
జవహర్ నగర్ పరిసర ప్రాంతాల్లో నివసించే ప్రజలు దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలను ఎదుర్కొనే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో డంపింగ్ యార్డు నిర్వహణ, వ్యర్థాల శాస్త్రీయ, గ్యాస్ నియంత్రణ చర్యలు వెంటనే చేపట్టాల్సిన అవసరం ఉందని వారు సూచిస్తున్నారు.
