పెళ్లైన 45 రోజులకే నవ వధువు మృతి
విశాఖలో విషాదం.. భర్త వేధింపులే కారణమంటూ కుటుంబ సభ్యుల ఆరోపణలు
ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో విషాద ఘటన చోటుచేసుకుంది. పెళ్లైన కేవలం 45 రోజులకే ఓ నవ వధువు అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం స్థానికంగా కలకలం రేపింది. శ్రీకాకుళం జిల్లాకు చెందిన తేజశ్రీకి నెలన్నర క్రితం సోమేశ్వరరావుతో వివాహం జరిగింది. పెళ్లి తర్వాత ఇద్దరూ విశాఖలో నివసిస్తున్నారు.
సోమేశ్వరరావు విశాఖలో లేడీస్ హాస్టల్ నిర్వహిస్తున్నట్లు సమాచారం. అయితే హాస్టల్‌లో ఉండే కొందరు యువతులతో అతనికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయని, పెళ్లికి ముందే ఈ విషయాలు కొనసాగుతున్నాయని పోలీసులు గుర్తించినట్లు తెలుస్తోంది. భార్యకు తాను డాక్‌యార్డ్‌లో ఉద్యోగం చేస్తున్నానని చెప్పి నమ్మించాడని సమాచారం.
మే 7న తేజశ్రీ ఇంట్లో ఉరివేసుకున్న స్థితిలో కనిపించింది. వెంటనే ఆస్పత్రికి తరలించినప్పటికీ అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. హాస్టల్‌లోని అమ్మాయిల వ్యవహారంపై భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరిగేవని దర్యాప్తు అధికారులు తెలిపారు.
తమ కుమార్తెను భర్త తీవ్రంగా వేధించాడని, ఇంటి నుంచి వెళ్లిపోవాలని ఒత్తిడి తెచ్చాడని తేజశ్రీ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఆమె మృతికి భర్తే కారణమని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
