ట్రిపుల్ విన్ ప్రోగ్రామ్‌తో ప్రపంచ స్థాయి అవకాశాలు అందిపుచ్చుకోండి: మంత్రి వివేక్ వెంకటస్వామి
జర్మన్ భాష నేర్చుకుంటే గ్లోబల్ కెరీర్‌కు బాటలు
హైదరాబాద్, మే 12: టామ్‌కామ్ ఆధ్వర్యంలో శిక్షణ పొందుతున్న నర్సులు జర్మన్ భాషతో పాటు కమ్యూనికేషన్ నైపుణ్యాల్లో ప్రావీణ్యం సాధించి ప్రపంచ స్థాయి అవకాశాలను అందిపుచ్చుకోవాలని రాష్ట్ర కార్మిక, ఉపాధి మరియు గనుల శాఖ మంత్రి Vivek Venkataswamy పిలుపునిచ్చారు. తెలంగాణ యువతలో అంతర్జాతీయ స్థాయిలో రాణించే అపార సామర్థ్యం ఉందని, కొత్త సంస్కృతులు మరియు అవకాశాలకు ఆత్మవిశ్వాసంతో అలవాటు పడాలని సూచించారు.
మంగళవారం హైదరాబాద్‌లోని టూరిజం ప్లాజాలో ట్రిపుల్ విన్ ప్రోగ్రామ్‌లో భాగంగా శిక్షణ పొందుతున్న నర్సులతో మంత్రి ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, జర్మనీలో పని చేయడం ఒక గొప్ప అవకాశం మాత్రమే కాకుండా ఒక పెద్ద సవాల్ కూడా అని పేర్కొన్నారు. కొత్త భాష, కొత్త వాతావరణం, కొత్త విధానాలకు అలవాటు పడాల్సి ఉంటుందని, కానీ కష్టపడి నేర్చుకుంటే విజయాన్ని సాధించవచ్చని తెలిపారు.
“నర్సులు రోగులకు ఇచ్చే ధైర్యం, నమ్మకంతోనే సగం వ్యాధి తగ్గిపోతుంది. మీ పాత్ర ఎంతో గొప్పది” అని మంత్రి అన్నారు.
టామ్‌కామ్ ద్వారా తెలంగాణ యువతకు అంతర్జాతీయ స్థాయి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నామని, ఇది కేవలం ప్రారంభమేనని తెలిపారు. ఈ బ్యాచ్ జర్మనీలో ప్రతిభ కనబరిస్తే భవిష్యత్తులో మరింత మంది యువతకు అవకాశాలు విస్తరించే అవకాశం ఉందన్నారు. అంతర్జాతీయ నర్సింగ్ డే సందర్భంగా నర్సులకు శుభాకాంక్షలు తెలుపుతూ, నర్సింగ్ వృత్తి అత్యంత గౌరవప్రదమైనదని కొనియాడారు.
జర్మన్ భాషపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించిన మంత్రి, డాక్టర్లు సూచించిన మందులు మరియు చికిత్సలను రోగులకు సరిగ్గా అర్థమయ్యేలా చెప్పాలంటే కమ్యూనికేషన్ చాలా కీలకమని పేర్కొన్నారు. ప్రస్తుతం ఆన్‌లైన్ వేదికల ద్వారా కూడా భాషలను సులభంగా నేర్చుకునే అవకాశాలు ఉన్నాయని తెలిపారు.
తన వ్యాపార అనుభవాలను గుర్తుచేసుకుంటూ, “నేను కేవలం ఐదు లక్షల రూపాయలతో వ్యాపారం ప్రారంభించాను. మద్రాస్‌లో బ్యాంక్ లోన్ కోసం వెళ్లినప్పుడు భాష తెలియక ఇబ్బంది పడ్డాను. అప్పుడు భాష ప్రాముఖ్యత అర్థమైంది” అని చెప్పారు.
తమిళ నటుడు Vijay ఉదాహరణను ప్రస్తావిస్తూ, ఆధునిక టెక్నాలజీ, సోషల్ మీడియా, కమ్యూనికేషన్ నైపుణ్యాలను సమర్థంగా వినియోగించుకుంటే గొప్ప విజయాలు సాధించవచ్చని వివరించారు. ప్రతిరోజూ కనీసం గంట సమయం కేటాయించి జర్మన్ భాషలో ప్రావీణ్యం సాధించాలని, జర్మన్ పుస్తకాలు చదివే స్థాయికి ఎదగాలని నర్సులకు సూచించారు.
టామ్‌కామ్ కార్యక్రమాల కోసం రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్‌లో ప్రత్యేక నిధులు కేటాయించిందని వెల్లడించిన మంత్రి, ముఖ్యమంత్రి Revanth Reddyతో మాట్లాడి రాష్ట్రంలో మరిన్ని నర్సింగ్ కళాశాలలు మరియు సీట్ల పెంపుపై చర్చిస్తానని హామీ ఇచ్చారు.
ఈ సందర్భంగా లేబర్, ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్ కమిషనర్ హరిచందన మాట్లాడుతూ, తాను మొదటిసారి హిందీ నేర్చుకునే సమయంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నానని తెలిపారు. హిందీ సినిమాలు చూస్తూ క్రమంగా భాష నేర్చుకున్నానని చెప్పారు.
“రాష్ట్ర ప్రభుత్వం విదేశీ ఉద్యోగ అవకాశాల కోసం ప్రత్యేక చొరవ తీసుకుంటోంది. ప్రభుత్వం మీకు ఉచితంగా జర్మన్ భాష నేర్పిస్తోంది. మీరు కమిట్‌మెంట్‌తో నేర్చుకోవాలి” అని ఆమె సూచించారు. స్నేహితులంతా కలిసి జర్మన్‌లో మాట్లాడే ప్రయత్నం చేయాలని, ఆ భాషలోనే ఆలోచించడం ప్రారంభించాలని సూచించారు.
టామ్‌కామ్ డైరెక్టర్ కాంతి వేస్లీ మాట్లాడుతూ, టామ్‌కామ్ సంస్థ జర్మనీలోని ఫెడరల్ ఎంప్లాయ్‌మెంట్ ఏజెన్సీతో ఒప్పందం కుదుర్చుకుందని తెలిపారు. ఇప్పటివరకు 46 మంది నర్సులు జర్మన్ భాష శిక్షణ పూర్తి చేసుకోగా, వారిలో 15 మందికి ఆఫర్ లెటర్లు వచ్చాయని, ఇప్పటికే 7 మంది జర్మనీలో ఉద్యోగాలు చేస్తున్నారని వెల్లడించారు.
ఈ సందర్భంగా జర్మనీలో పనిచేస్తున్న నర్సులతో మంత్రి ఆన్‌లైన్‌లో మాట్లాడి వారి అనుభవాలను తెలుసుకున్నారు. ఎదుర్కొంటున్న సమస్యలు, అవసరాలను ప్రభుత్వానికి తెలియజేయాలని సూచించారు.
