Panchayat Election: నేడో.. రేపో.. నగారా..!

whatsapp image 2025 11 24 at 8.09.29 am

పంచాయతీ, వార్డుల రిజర్వేషన్లపై జిల్లాల్లో గెజిట్‌ల జారీ

నేడు ఎస్‌ఈసీకి అందజేయనున్న పీఆర్‌

హైదరాబాద్‌, నవంబరు 23 : రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల నగారా మోగించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం సిద్ధమవుతోంది.

ఈ నెల 26న ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్‌ విడుదల చేసేందుకు కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల నిర్వహణను సైతం తొందర్లోనే పూర్తిచేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. గ్రామ పంచాయతీలకు జరగబోయే ఎన్నికలకు సంబంధించి.. ఆయా జిల్లాల్లో సర్పంచ్‌, వార్డు సభ్యులకు సంబంధించి రిజర్వేషన్ల ప్రక్రియ దాదాపు పూర్తయింది. ప్రభుత్వం జారీచేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా.. వార్డు సభ్యుల రిజర్వేషన్లను ఎంపీడీవోలు ఖరారు చేయగా, సర్పంచుల రిజర్వేషన్లను ఆర్‌డీవోలు సిద్ధం చేశారు. ఎంపీడీవోలు, ఆర్డీవోలు తమ పరిధిలోని మండలాల వారీగా రూపొందించిన రిజర్వేషన్ల జాబితా కలెక్టర్లకు సమర్పించారు. వారు అందించిన వివరాల ఆధారంగా నిబంధనలను సరిపోల్చుకుని.. జిల్లాల వారీగా (హైదరాబాద్‌, మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లాలు మినహా) సర్పంచ్‌, వార్డుసభ్యుల రిజర్వేషన్లకు సంబంధించిన గెజిట్‌ నోటిఫికేషన్‌ ను కలెక్టర్లు ఆదివారం విడుదల చేశారు. గెజిట్‌ కాపీలను పూర్తి సమాచారంతో రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖకు ఆన్‌లైన్‌లో చేరవేశారు. జిల్లాల వారీగా రిజర్వేషన్లకు సంబంధించిన జాబితా ఇప్పటికే ప్రజా సంబంధాల శాఖకు చేరింది. ఏ జిల్లానుంచైనా రావాల్సిన తుది జాబితా ఉంటే, సోమవారం ఉదయంలోపు సేకరించి.. రాష్ట్ర ఎన్నిల సంఘానికి సమర్పించేలా అధికారులు కసరత్తు చేస్తున్నారు. రిజర్వేషన్ల ఖరారు పూర్తయిన తర్వాతనే ఎన్నికల ప్రక్రియకు మార్గం సుగమం అవుతుంది. రిజర్వేషన్లను సూచిస్తూ.. జిల్లాల్లో విడుదలైన గెజిట్‌ సమాచారం ఆధారంగానే ఎస్‌ఈసీ ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించే అవకాశం ఉంది.

ఎన్నికల నిర్వహణకు క్షేత్రస్థాయిలో ఏర్పాట్లు

రాష్ట్రవ్యాప్తంగా 12,760 సర్పంచు, 1,12,534 వార్డు సభ్యుల స్థానాలకు సంబంధించి ఎన్నికల నిర్వహణకోసం పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. గ్రామ పంచాయతీల వారీగా తుది ఓటరు జాబితాలు సిద్ధం అయ్యాయి. ఓటర్లు ఒక వార్డు నుంచి మరో వార్డుకు మారడం, ఒక కుటుంబంలోని ఓటర్లందరూ ఒకేవార్డులో ఉండేలా మ్యాపింగ్‌లో తప్పులు సరిదిద్దే ప్రక్రియ పూర్తయింది. మూడు విడతల్లో ఎన్నికలు నిర్వహించాలని ఆదేశాలు అందడంతో అధికారులు ఆయా ఏర్పాట్లలో నిమగ్నమై ఉన్నారు. పార్టీ గుర్తుల్లేకుండానే సర్పంచ్‌, వార్డుసభ్యుల ఎన్నికలు చేపడుతున్నప్పటికీ.. ఆయా గ్రామాల్లో పోటీచేసే అభ్యర్థుల్లో, గెలుపు గుర్రాలపై రాజకీయ పార్టీలు దృష్టిపెట్టాయి. పోటీ చేయాలనుకునే వారు సైతం ఆయా పార్టీల మద్దతు కూడగట్టుకుంటూనే, ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. తమ మద్దతుతో గెలిచే అభ్యర్థుఽల ద్వారా భవిష్యత్‌ ప్రణాళికలు రూపొందించుకోవాలన్న యోచనలో ఆయా పార్టీలు.. కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకుంటున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *