పెద్దపల్లి రాజకీయ పరిణామాలు.. కాంగ్రెస్ ఇన్చార్జ్ సందీప్‌తో మంత్రి వివేక్ భేటీ
గాంధీభవన్‌కు రావాలని పెద్దపల్లి నేతలకు పిలుపు
వంశీకృష్ణ–శ్రీధర్‌బాబు వివాదంతో నాకు సంబంధం లేదు: మంత్రి వివేక్
హైదరాబాద్, నవంబర్ 26: తెలంగాణ కాంగ్రెస్‌లో పెద్దపల్లి జిల్లా రాజకీయ పరిణామాలు ఆసక్తికరంగా మారాయి. కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల నూతన ఇన్చార్జి బీఎం సందీప్ కుమార్‌ను శక్తి, గనుల శాఖ మంత్రి డాక్టర్ గడ్డం వివేక్ వెంకటస్వామి గురువారం గాంధీభవన్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పెద్దపల్లి జిల్లాకు చెందిన పార్టీ ముఖ్య నేతలు గాంధీభవన్‌కు రావాలని పిలుపునిచ్చినట్లు సమాచారం.
ఈ సమావేశానికి పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ, మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌రావు కూడా హాజరయ్యారు. ఎంపీ వంశీకృష్ణ, మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు మధ్య నెలకొన్న విభేదాల నేపథ్యంలో ఈ భేటీకి రాజకీయ ప్రాధాన్యత ఏర్పడింది.
అనంతరం మంత్రి వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ.. ఎంపీ వంశీకృష్ణ స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోగలరని, తన రాజకీయ వ్యవహారాలను ఆయనే చూసుకుంటారని తెలిపారు. వంశీకృష్ణ, మంత్రి శ్రీధర్‌బాబు మధ్య ఉన్న వివాదంతో తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు.
పార్టీలో తనకు ఎవరితోనూ వ్యక్తిగత విభేదాలు లేవని పేర్కొన్నారు. తాను పార్టీ మారుతున్నానంటూ జరుగుతున్న ప్రచారాన్ని ఖండించారు. ఇలాంటి వార్తలు ప్రచారం చేసేవారికి కనీస విచక్షణ ఉండాలని వ్యాఖ్యానించారు. తాను ఎవరిపైనా ఫిర్యాదులు చేయబోనని, పార్టీ క్రమశిక్షణకు కట్టుబడి పనిచేస్తానని మంత్రి స్పష్టం చేశారు.
