తెలుగు స్వాతంత్య్ర సమరయోధుల జీవిత విశేషాలపై ఛాయా చిత్ర ప్రదర్శన
హైదరాబాద్: స్వాతంత్య్రోద్యమంలో పాల్గోన్న తెలుగు స్వాతంత్య్ర సమర యోధుల గురించి తెలుపుతూ కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖకు చెందిన రీజనల్ అవుట్ రీచ్ బ్యూరో (ఆర్.ఒ.బి.), ప్రాంతీయ పాస్ పోర్ట్ కేంద్రం సంయుక్తంగా సికింద్రాబాద్ లోని పాస్ పోర్ట్ కార్యాలయం ఆవరణలో ఛాయా చిత్ర ప్రదర్శనను ఏర్పాటు చేసింది.
ఈ ప్రదర్శనను పత్రికా సమాచార కార్యాలయం (సౌత్ జోన్) డైరెక్టర్ జనరల్ ఎస్. వెంకటేశ్వర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా తను మాట్లాడుతూ, విదేశీ వ్యవహారాల శాఖ నిర్వహిస్తున్న ‘ఆజాదీకా అమృత్ మహోత్సవం’ లో భాగంగా స్వాతంత్య్ర పోరాట యోధుల త్యాగాలను స్మరించుకోవడానికి ఈ ప్రదర్శనను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
ఈ ప్రదర్శన ఫిబ్రవరి 21 నుంచి ఫిబ్రవరి 27వ తేదీ వరకు కొనసాగుతుంది. ఈ ఎగ్జిబిషన్ లో కుమురం భీం, చాకలి ఐలమ్మ, స్వామి రామానంద తీర్థ, అల్లూరి సీతారామరాజు, టంగుటూరి ప్రకాశం పంతులు తదితరుల స్వాతంత్య్ర సమరయోధుల వీరోచిత పోరాటల గురించి నేటి తరానికి ఈ ఛాయాచిత్రాలు క్లుప్తంగా వివరిస్తాయి. పాస్ పోర్ట్ ప్రాంతీయ కార్యాలయం సహకారంతో ఏర్పాటు చేసిన ఈ ప్రదర్శనలో సుమారు 42 ఛాయాచిత్రాలను సందర్శనకు ఉంచారు. ఈ కార్యక్రమంలో ప్రాంతీయ పాస్ పోర్ట్ కార్యాలయం డిప్యూటీ పాస్ పోర్ట్ అధికారి ఇందు భూషణ్ లెంకా, పత్రికా సమాచార కార్యాలయం అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఎస్. రవీంద్ర, ఆర్ఒబి అధికారులు శృతిపాటిల్, హరిబాబు, భారతలక్ష్మి, ఎగ్జిబిషన్ అధికారి అర్థ శ్రీనివాస్, ప్రాంతీయ పాస్ పోర్ట్ కార్యాలయ అధికారులు తదితరులు పాల్గొన్నారు.