హైదరాబాద్:నవంబర్ 19
సినిమా పైరసీ కేసుల్లో ప్రధాన నిందితుడిగా ఉన్న ఐ బొమ్మ ఇమ్మడి రవి,కి నాంపల్లి హైకోర్టు ఐదు రోజులు పోలీస్ కస్టడీ విధించింది, ఈ మేరకు బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన పైరసీ మూవీ రాకెట్ ఐ బొమ్మ కేసులో కీలక మలుపు తిరిగింది ఈ కేసులో ప్రధాన సూత్రధారి ఇమ్మడి రవిని మరింత లోతుగా విచారణ జరిపేందుకు పోలీసులు నాంపల్లి కోర్టులో కస్టడీ పిటిషన్ దాఖలు చేశారు.
ఈ కేసులో మరిన్ని వివరా లు రాబట్టేందుకు రవిని వారం రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయ మూర్తి, ఐదు రోజుల కస్టడీకి అనుమతినిచ్చారు. దీంతో పోలీసులు ఐబొమ్మ రవిని కస్టడీలోకి తీసుకుని విచారించనున్నారు.
కొత్త సినిమాలు, ఓటీటీ కంటెంట్‌ను పైరసీ చేస్తూ చిత్ర పరిశ్రమకు తీవ్ర నష్టం కలిగిస్తున్నాడన్న ఆరోపణ లతో ఇమ్మడి రవిని గత శనివారం కూకట్‌పల్లిలో సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఏడేళ్లుగా ఐ బొమ్మతో పాటు బప్పం,ఐ విన్, ఐ రాధ టీవీ వంటి పేర్లతో పలు వెబ్‌సైట్లను నడుపుతున్నట్లు పోలీసులు గుర్తించారు.
రవి నివసిస్తున్న అపార్ట్‌మెంట్‌లో పోలీసులు జరిపిన సోదాల్లో రూ.3 కోట్ల నగదు, వందల సంఖ్యలో హార్డ్ డిస్క్‌లు, కంప్యూటర్లు, సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం అతడిని బషీర్‌బాగ్‌లోని సీసీఎస్‌కు తరలించి విచారించారు. తాజాగా కోర్టులో హాజరుపరచగా, కస్టడీకి అనుమతి లభించింది.

