కరీంనగర్‌లో కాల్పులు – బంగారం దోపిడీతో కలకలం
కరీంనగర్, మే 3: జిల్లాలో సంచలనం రేపిన దోపిడీ ఘటన చోటుచేసుకుంది. కరీంనగర్ లో కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ నివాసానికి సమీపంలో ఉన్న పీఎంజే జువెల్లర్స్‌లో పట్టపగలే దొంగలు కాల్పులకు తెగబడి బంగారం దోచుకెళ్లారు.
జిల్లా జడ్జి క్వార్టర్స్ వెనుక భాగంలో ఉన్న ఈ షాపులోకి వచ్చిన ఏడుగురు దుండగులు, అక్కడున్న వారిపై కాల్పులు జరిపి బంగారం అపహరించారు. ఈ కాల్పుల్లో నలుగురు వ్యక్తులు గాయపడగా, వారిని మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ కు తరలించారు.
గమనించదగ్గ విషయం ఏమిటంటే, ఘటన స్థలానికి అతి సమీపంలోనే కేంద్ర మంత్రి బండి సంజయ్ అరగంట ముందే సీసీ రోడ్డు శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొని వెళ్లారు. అలాగే, ముందు రోజు రాత్రి పోలీసులు నాకా బందీ కూడా నిర్వహించినట్లు సమాచారం. ఘటనకు అరగంట ముందు వరకు అక్కడ పోలీసు బందోబస్తు ఉన్నప్పటికీ దుండగులు ధైర్యంగా దోపిడీకి పాల్పడడం ఆందోళన కలిగిస్తోంది.
దుండగులు ఉపయోగించిన మ్యాగజైన్‌ను కోర్టు వెనుక ప్రాంతంలో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం నిందితుల కోసం పోలీసులు విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు.
ఈ ఘటన స్థానికంగా తీవ్ర భయాందోళనలు రేకెత్తించింది.
