విద్యతో పాటు క్రీడలకు ప్రాధాన్యం – సి స్పోర్ట్స్ కాంప్లెక్స్ ప్రారంభించిన మంత్రి వివేక్ వెంకటస్వామి
హైదరాబాద్ (తెల్లాపూర్), మే 3:
అమృత సత్తయ్య కొల్లూరి ఎడ్యుకేషనల్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్మించిన సి స్పోర్ట్స్ కాంప్లెక్స్‌ను రాష్ట్ర కార్మిక, గనుల శాఖ మంత్రి డా. గడ్డం వివేక్ వెంకటస్వామి శనివారం ఘనంగా ప్రారంభించారు. తెల్లాపూర్ లోని జేపీ కాలనీలో నిర్మించిన ఈ కాంప్లెక్స్‌ను మంత్రి, ప్రొఫెసర్ కంచె ఐలయ్య తదితరులు జ్యోతి ప్రజ్వలన చేసి, రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ప్రైవేట్ రంగంలో ఇంత భారీ స్థాయిలో విద్యాసంస్థతో పాటు స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మించడం అభినందనీయమని తెలిపారు. భవిష్యత్ తరాలకు ఉపయోగపడేలా దూరదృష్టితో చేపట్టిన ఈ ప్రాజెక్ట్ సత్తయ్య గారి విజన్‌ను ప్రతిబింబిస్తుందని కొనియాడారు.
ప్రొఫెసర్ కంచె ఐలయ్య ఈ కార్యక్రమాన్ని గుర్తుచేసి విలువైన సూచనలు అందించినట్లు మంత్రి వెల్లడించారు. ఈ సంస్థలో జర్మన్ భాషను ప్రవేశపెట్టాలని సూచిస్తూ, తన జర్మనీ పర్యటనలో తెలిసిన విషయాలను పంచుకున్నారు. నైపుణ్యం ఉన్న యువతకు విదేశాల్లో, ముఖ్యంగా జర్మనీలో విస్తృతమైన ఉద్యోగ అవకాశాలు ఉన్నాయని చెప్పారు.
తన చిన్ననాటి అనుభవాలను గుర్తుచేసుకుంటూ, తాను కూడా క్రికెట్, టేబుల్ టెన్నిస్ వంటి క్రీడల్లో పాల్గొన్నానని తెలిపారు. క్రీడలు వ్యక్తిత్వ వికాసానికి కీలకమని, స్పోర్ట్స్‌మన్ స్పిరిట్ జీవితంలో ముందుకు నడిపిస్తుందని అన్నారు.
మెడికల్ విద్య పూర్తయ్యాక తన తండ్రి వ్యాపారం ప్రారంభించేందుకు ప్రోత్సహించారని, పటాంచేరు వద్ద ప్రారంభించిన పరిశ్రమ ప్రస్తుతం 14 రాష్ట్రాలకు విస్తరించిందని గుర్తుచేశారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులను చూసి సంతోషం వ్యక్తం చేసిన మంత్రి, ఈ సంస్థకు అవసరమైన ప్రభుత్వ సహాయంపై ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి తో చర్చిస్తానని హామీ ఇచ్చారు.
కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, ప్రముఖులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. జేబీ రాజు చెప్పిన మాటలకు కృతజ్ఞతలు తెలుపుతూ, తాను మంత్రి కావాలన్న ఆశ నెరవేరిందని మంత్రి పేర్కొన్నారు.
